బ్రహ్మోత్సవాల వేళ వారికి ప్రత్యేక అవకాశం- శ్రీవారి సేవకుల పై తాజా నిర్ణయం..!!
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రావణ మాసం.. వరుస సెలవుల వేళ భక్తులు పెద్ద సంఖ్య లో తిరుమలకు తరలి వస్తున్నారు. క్యూ లైన్ శిలా తోరణం వరకు కొనసాగుతోంది. టోకెన్ లేని భక్తులకు దర్శనం కోసం 18-20 గంటల సమయం పడుతోంది. ఈ సారి రెండు సార్లు శ్రీ వారి బ్రహ్మోత్సవాలు రావటంతో.. టీటీడీ అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. శ్రీవారి సేవకుల విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
పెరుగుతున్న రద్దీ వేళ భక్తులకు సేవలను మరింతగా అందుబాటులోకి తెచ్చేందుకు టీటీడీ కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందు కోసం శ్రీవారి సేవకుల కు బాధ్యతలు అప్పగిస్తోంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో శ్రీవారి సేవకులు సేవలు అందిస్తున్నారు. శ్రీవారి సేవకులు అందిస్తున్న సేవలకు గ్రేడింగ్ ఇస్తూ వారిని ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా తమకు అప్పగించిన పనిని సక్రమంగా చేయడంతో పాటు అదనంగా పనిచేస్తుంటే అత్యుత్తమం అని, అప్పగించిన పనిని బాగా చేస్తే ఉత్తమం అని, సక్రమంగా చేయకపోతే నామమాత్రం అని గ్రేడింగ్ ఇస్తున్నారు. అత్యుత్తమ గ్రేడింగ్‌కు ఎంపికైన బృందాల సేవలను బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక పర్వదినాల సమయంలో వినియోగించుకోవాలని డిసైడ్ అయ్యారు.

ఉత్తమ గ్రేడింగ్ సాధించిన వారికి బ్రహ్మోత్సవాల వేళ బాధ్యతలు
ఇక, సేవల్లో మరింత బాధ్యత పెంచే విధంగా ప్రస్తుతం విధుల్లో ఉన్న/ పదవీ విరమణ చేసిన గెజిటెడ్ అధికారులు, ఆపై స్థాయి వారిని ప్రిన్సిపల్ సూపర్‌వైజర్లుగా టీటీడీ అధికారులు ఎంపిక చేశారు. వీరిలో వివిధ బ్యాంకులు, ప్రముఖ సంస్థల్లో ఉన్నత హోదాల్లో పనిచేసినవారు ఉంటారు. నెలకు ఐదుగురు ప్రిన్సిపల్ సూపర్‌వైజర్లు పనిచేస్తారు. వీరిలో ఒక్కొక్కరి కింద 10 నుంచి 15 మంది గ్రూప్ సూపర్‌వైజర్లు ఉంటారు. నెల ముగిసిన తర్వాత తమ స్థానంలో వచ్చే ప్రిన్సిపల్ సూపర్‌వైజర్లకు ఈ బాధ్యతలు అప్పగించేలా కార్యాచరణ అమలు చేస్తున్నారు. గ్రాడ్యుయేషన్ అర్హత ఉన్నవారిని గ్రూప్ సూపర్‌వైజర్లుగా ఎంపిక చేస్తున్నారు. వీరు 15రోజుల పాటు విధుల్లో ఉంటారు. ఒక్కో గ్రూప్ సూపర్‌వైజర్ కింద 10 నుంచి 15 శ్రీవారి సేవకుల బృందాలు ఉంటాయి. ప్రతి గ్రూపులో 10 నుంచి 15 మంది సభ్యులు ఉంటారు. సేవకులకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు యాప్ ద్వారా అందిస్తారు. దీంతో.. వీరి సేవలను మరింత పకడ్బందీగా వినియోగించుకోవాలని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications