రాజధాని అమరావతిలో చురుగ్గా ఏర్పాట్లు: ఎల్లుండే
Amaravati: రాజధాని అమరావతి పరిధిలోని వెంకటపాలెంలో గల శ్రీవారి ఆలయంలో ఈ నెల 15వ తేదీన శ్రీనివాస కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. అ ఉత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు హాజరు కానున్నారు.
2018లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఆలయ నిర్మాణానికి వెంకటపాలెంలో 25 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. 2019లో శంకుస్థాపన చేశారు. ఆ తరువాత వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆలయాన్ని నిర్మించింది. 2022లో వైభవంగా ప్రారంభించింది. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించింది.
శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకుని.. టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు సమీక్ష నిర్వహించారు. శ్రీవారి ఆలయ ప్రాంగణంలో ఈ సమావేశం ఏర్పాటైంది. టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ సతీష్ కుమార్, టీటీడీ అధికారులు ఇందులో పాల్గొన్నారు.

శ్రీనివాస కల్యాణంపై అమరావతి గ్రామాల్లో టీటీడీ ప్రచారం రథం ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తోన్నట్లు చెప్పారు. భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా కల్యాణ వేదిక పరిసరాలలో అవసరమైన గ్యాలరీలు, క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. భక్తులు సులభతరంగా స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తోన్నట్లు తెలిపారు.
ట్రాఫిక్ అంతరాయం తలెత్తకుండా పార్కింగ్ స్థలాలను గుర్తించామని, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా వాహనాలను ఎక్కడ నిలపాలనే విషయాన్ని భక్తులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తామని శ్యామలరావు అన్నారు. కల్యాణోత్సవానికి భజన బృందాలు, శ్రీవారి సేవకులను ఆహ్వానిస్తామని, వారి సేవలను వినియోగించుకుంటామని పేర్కొన్నారు.
జిల్లా, టీటీడీ అధికారుల కోసం ప్రత్యేకంగా జాయింట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని శ్యామలరావు చెప్పారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టి సీసీ కెమెరాలతో నిరంతరం భద్రతను పర్యవేక్షించాలని ఆదేశించారు. వివిధ ప్రాంతాల నుండి భక్తులు సులువుగా ఆలయానికి చేరుకోవడానికి వీలుగా తగినన్ని ఆర్టీసీ బస్సులు నడిపించేలా చర్యలు తీసుకుంటోన్నట్లు చెప్పారు.
అత్యవసర సమయంలో స్పందించేలా విపత్తు నిర్వహణ బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. భక్తులకు అవసరమైన వైద్య సదుపాయాలు, మందులు, సిబ్బంది, అంబులెన్సులు అందుబాటులో ఉంచుతామని వివరించారు. స్వామివారి కళ్యాణాన్ని ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తామని శ్యామలరావు చెప్పారు.
కాగా- తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్లో నాలుగో రోజు బుధవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు తెప్పపై భక్తులకు అభయమిచ్చారు. తొలుత ఉత్సవ మూర్తులను శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు.
విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఆశీనులై పుష్కరిణిలో ఐదు చుట్లు విహరించి భక్తులను అనుగ్రహించారు. మంగళవాయిద్యాలు, వేదపండితుల వేదపారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం కన్నులపండువగా ఈ ఉత్సవం జరిగింది.












Click it and Unblock the Notifications