TTD: నడక మార్గంలో వచ్చే భక్తులకు టీటీడీ కీలక సూచనలు - తప్పనిసరి..!!
Tirumala: టీటీడీ అధికారులు కీలక ప్రకటన చేసారు. తిరుమలకు నడక మార్గంలో వచ్చే భక్తులకు సూచనలు చేసారు. ఆరోగ్య సమస్యలు ఉన్న వారు మెట్ల మార్గాన్ని ఎంచుకోవద్దని సూచించింది. ఒక వేళ రావాల్సి వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటుగా అందుబాటులో ఉన్న వైద్య సేవల గురించి వివరించింది. కాలి నడక మార్గంలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పని సరిగా టీటీడీ సూచనలు పాటించాలని అధికారులు కోరుతున్నారు.
టీటీడీ సూచనలు
తిరుమలకు నడక మార్గంలో వచ్చే భక్తులు కొందరు అస్వస్థులు కావటంతో టీటీడీ ఈ వ్యవహారం పైన ఫోకస్ చేసింది. నడక మార్గంలో వచ్చే భక్తులకు ఆరోగ్య పరమైన సూచనలు చేసింది. అదే సమయంలో వైద్య సదుపాయాల గురించి కీలక ప్రకటన చేసింది. 60 ఏళ్ల వయసు దాటిన వారి తో పాటుగా మధుమేహం, అధిక రక్తపోటు, ఉబ్బసం, మూర్ఛ, కీళ్ల వ్యాధులు ఉన్న భక్తులు తిరుమలకు నడక మార్గంలో రావటం మంచిది కాదని టీటీడీ సూచించింది.

వైద్య సాయం
ఊబకాయం సమస్య ఎదుర్కొంటున్న భక్తులు, గుండె సంబంధిత సమస్యలు ఉన్న వారు తిరుమలకు నడక దారిన రావటం శ్రేయస్కరం కాదని పేర్కొంది. తిరుమల కొండ సముద్ర మార్గానికి చాలా ఎత్తులో ఉన్న కారణంగా ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉంటుందని వివరించింది. కాలి నడకన రావటం చాలా ఒత్తిడితో కూడుకున్న విషయం కావటంతో గుండె సంబంధిత సమస్యలు, ఉబ్బసం వ్యాధిని తీవ్ర తరం చేసే అవకాశం ఉంటుందని అలర్ట్ చేసింది. దీనిని పరిగణలోకి తీసుకొని భక్తులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
జాగ్రత్తలు
దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారు తమ మందులను వెంట తప్పనిసరిగా తెచ్చుకోవాలని సూచన చేసింది. కాలినడకన వచ్చే భక్తులు ఏదైనా సమస్య ఉంటే అలిపిరి కాలిబాట మార్గంలోని 1500 మెట్టు, గాలి గోపురం, భాష్య కార్ల సన్నిధి వద్ద వైద్యం సాయం పొందవచ్చని వెల్లడించింది. దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి గ్రస్తులకు అత్యవసర పరిస్థితుల్లో తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రిలో సౌకర్యం కల్పిస్తున్నామని టీటీడీ పేర్కొంది. దీంతో, కాలి నడక మార్గంలో వచ్చే భక్తులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని టీటీడీ సూచించింది.












Click it and Unblock the Notifications