తిరుమలలో సేవలు, దర్శనం, గదులు పొందాలంటే - అమల్లోకి కొత్త విధానం...!!
TTD: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవుల వేళ భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. భక్తులకు దర్శనం.. సేవల విషయంలో సాంకేతికత వినయోగం దిశగా టీటీడీ చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే క్యూ లైన్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ద్వారా వేగంగా దర్శనం జరిగేలా ప్రయత్నాలు చేస్తోంది. ఇదే సమయంలో.. ఇక తిరుమలలో వెలుగులోకి వస్తున్న మోసాలకు చెక్ పెడుతూ... సేవలతో సహా.. దర్శనం - వసతి కల్పనలో టీటీడీ ఇక నుంచి కొత్త విధానం అమలుకు సిద్దం అవుతోంది.
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, గదుల కేటాయింపు సహా దర్శన టికెట్లకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రస్తుతం భక్తుల ఆధార్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటోంది. అయితే.. కొందరు ఈ కార్డుల విషయంలో అక్రమాలకు పాల్పడుతున్నారు. దీంతో ఆధార్ వాస్తవికతను నిర్ధారిస్తే తప్ప.. అవి అసలో.. నకిలీవో.. తెలిసే అవకాశం లేదు. కానీ, ఆధార్ కార్డుల వాస్తవికతను గుర్తించే వ్యవస్థ టీటీడీ వద్ద లేదు. ఈ నేపథ్యంలో ముఖ గుర్తింపు(ఫేస్ రికగ్నిషన్)తోపాటు, ఆధార్ నిర్ధారణ వ్యవస్థలను తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. దీనికి సం బంధించి యూఐడీఏఐ సేవలు వినియోగించాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు యూఐడీఏఐ అధికారులు టీటీడీ యంత్రాంగంతో పలు అంశాలపై చర్చించారు. ఆధార్ సేవలను వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు.

టీటీడీ చర్చలు.. నకిలీలకు చెక్
అందులో భాగంగా అథెంటికేషన్ యూజర్ ఏజెన్సీ(ఏయూఏ) రిజిస్ర్టేషన్ కోసం రెండేళ్లకు రూ.20 లక్షలు చెల్లించాలని సూచించారు. ఆధార్ నిర్ధారణకు ఒక్కొక్క లావాదేవీకీ 4 పైసలు, ఈకేవైసీకి రూ.3.40 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. యూఐడీఏఐ సేవలు వినియోగించుకునేందుకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సంబంధిత నోటిఫికేషన్ ఇచ్చేలా టీటీడీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఆధార్ ఆధారిత ఫేస్ రికగ్నిషన్ అమలులోకి వస్తే, ఒక్కో భక్తి వివరాలు ఖచ్చితంగా ధృవీకరించే వెసులుబాటు కలుగుతుంది. దీంతో ఫేక్ బుకింగ్స్, నకిలీ గుర్తింపు పత్రాల వినియోగం తగ్గే అవకాశం ఉంది. ఇక తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఏప్రిల్ నెలలో విశేష ఉత్సవాలు జరగనున్నాయి.












Click it and Unblock the Notifications