అలిపిరి వద్ద అత్యాధునికంగా..!!
Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం నాడు 87,536 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 35,120 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.33 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్న ప్రసాదం, అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

శ్రీవారి భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న భవనాల నిర్మాణంపై టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామల రావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు. నిర్దుష్ట గడువులోగా ఆయా భవన సముదాయాల నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు.
టీటీడీలో జరుగుతున్న పనులపై ఎప్పటికప్పుడు సమీక్షించుకుని నిర్దేశించిన సమయానికి పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాంట్రాక్టర్లల్లో అలసత్వం లేకుండా ఇంజినీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి నివేదిక సమర్పించాలని చెప్పారు.
టీటీడీలో దళారి వ్యవస్థ, నకిలి టికెట్ల పేరుతో సేవల టికెట్ల అమ్మకాలు, అవినీతిపై మరింత నిఘా ఉంచడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని శ్యామలరావు అన్నారు. భక్తులకు మరింత నాణ్యంగా, వేగంగా సేవలు అందించడానికి అలిపిరి టోల్ గేట్ ను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని, దీని విస్తరణకు అవసరమైన ప్రతిపాదనలను రూపొందించాలని ఈఓ చెప్పారు.
అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉండే సౌకర్యాలను పరిశీలించి నివేదిక సమర్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆ మాదిరిగా అలిపిరి టోల్ గేట్ వద్ద చెకింగ్ పాయింట్ విస్తరణ, లేటెస్ట్ కెమెరాల ఏర్పాటు, వాహనాలు, లగేజీ స్కానింగ్ యంత్రాలు, సెక్యూరిటీ పెంచే అంశం తదితర అంశాలపై టీటీడీ సెక్యూరిటీ, ఇంజినీరింగ్, ఐటీ అధికారులు అధ్యయనం చేయాలని అన్నారు.
భక్తులకు మరింత సౌకర్యవంతంగా, పరిశుభ్రంగా, ఆధునిక సౌకర్యాలతో కళ్యాణ కట్ట కోసం ఎంపిక చేసిన ప్రాంతంలో ప్రయోగాత్మకంగా నిర్మాణం చేపట్టి దశలవారీగా విస్తరణ చేసే అంశాన్ని పరిశీలించాలని శ్యామలరావు అన్నారు. భక్తులకు అన్నప్రసాదాలు అందించేందుకు నిల్వ వుంచే వంటసామాగ్రి కోసం మార్కెటింగ్ గోడౌన్ లో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటుపై చర్యలు తీసుకోవాలని సూచించారు.
మాస్టర్ ప్లాన్ లో భాగంగా అలిపిరి భూదేవి కాంప్లెస్ లో ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయం, శ్రీ కపిలతీర్థం, నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం, నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామి ఆలయాల్లో కొనసాగుతున్న నిర్మాణాల గురించి ఆయన ఆరా తీశారు.
అలాగే- అమరావతిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం, ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయం, తిరుమలలోని పాపవినాశం, శిలాతోరణం ప్రాంతాలలో వేగంగా అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయాలని ఆదేశించారు. నవీ ముంబై, బాంద్రా, యానాం, అనంతవరం, ఉల్లందూర్ పేట తదితర ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణాలపై తాజా పరిస్థితిని నివేదించాలని చెప్పారు.












Click it and Unblock the Notifications