శాశ్వతంగా అమరావతిలో అతి భారీ కార్యక్రమం..
తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటోన్నారు. 82,256 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 23,331 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.08 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
రాజధాని అమరావతిలో పవిత్ర హారతులు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని తిరుమల తిరుపతి దేవస్థానం యోచిస్తోంది. వారణాశిలో గంగా హారతి, ఉజ్జయినీ తరహాలో సాయంత్రం వేళ.. ఈ కార్యక్రమాన్ని రూపొందించాలని భావిస్తోంది. దీనికి గల అవకాశాలను పరిశీలించాలని టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ అధికారులకు సూచించారు. దీనిపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ వారణాశి, ఉజ్జయినిలో సహా ఇతర నగరాల్లో ఎక్కడెక్కడ పవిత్ర హారతులు ఇస్తున్నారో తెలుసుకోవాలని, దీనికోసం ఓ కమిటీని వేయాలని అన్నారు. దీనిపై ఓ సమగ్ర నివేదిక రూపొందించాలని సూచించారు. వేద మంత్రోచ్ఛారణలు, దీపకాంతులు, ఘంటానాదాల మధ్య పవిత్ర హారతి కార్యక్రమం భక్తులకు మరింత దివ్యానుభూతిని పెంచుతుందని, టీటీడీ అధికారుల కమిటీ లోతుగా అధ్యయనం చేసి సమగ్ర నివేదిక రూపొందించాలని అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు.
ఇప్పటికే పలు రాష్ట్రాల రాజధానుల్లో టీటీడీ శ్రీవారి ఆలయాలు నిర్మించడానికి ఆయా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాశామని, వారితో సమన్వయం చేసుకోవాలని సూచించారు. గౌహతి, బెళగావిల్లో భూ కేటాయింపులపై సంబంధిత అధికారులతో చర్చించాలని అన్నారు. ఈ నెలాఖరులో వేదపారాయణ దారులు, పోటు వర్కర్లకు వేర్వేరుగా శిక్షణ ఇవ్వడానికీ తగిన చర్యలు తీసుకోవాలని ఈఓ సూచించారు. టీటీడీలోని 59 అనుబంధ, స్థానిక ఆలయాలలో 1,004 సీసీ కెమెరాలకు ఆదేశాలు ఇచ్చామని పేర్కొన్నారు.
ఇందులో 794 కెమెరాలు కార్యరూపంలో ఉన్నాయని, మిగిలిన చోట్ల సీసీకెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సింఘాల్ చెప్పారు. అలాగే స్థానిక, అనుబంధ ఆలయాలలో అన్నప్రసాద వితరణ చేసే దాతల పేర్లు ఎల్ఈడీ స్క్రీన్లల్లో డిస్ ప్లే అయ్యేలా చర్యలు చేపట్టాలని అన్నారు. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాలలో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి అవసరమైన భూమి కోసం ఆయా జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications