వసతి గదులపై టీటీడీ కీలక నిర్ణయం: ఈఓ యాక్షన్ ప్లాన్?
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొంత తగ్గింది. గురువారం నాడు 56,225 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 19,588 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.95 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 15 కంపార్ట్‌మెంట్లల్లో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 15 నుంచి 17 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూలైన్లల్లో ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకలు అన్న ప్రసాదాలను అందజేశారు.

కాగా- తిరుమలలో కాలం చెల్లిన విశ్రాంతి గృహాలపై టీటీడీ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పాత వసతి గదులు, భక్తుల విశ్రాంతి గదుల భవన సముదాయాలను పునర్నిర్మించడానికి కార్యాచరణ రూపొందించాలని టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు ఆదేశించారు. దీనకి అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అన్నారు.
అదనపు ఈఓ సీ హెచ్ వెంకయ్య చౌదరి శుక్రవారం తిరుమలలో వివిధ వసతి గదుల భవన సముదాయాలు, క్వార్టర్లను శ్యామలరావు పరిశీలించారు. సుదర్శన్, గోవర్ధన్, కళ్యాణి, సీ-టైప్ క్వార్టర్లల్లో గల విశ్రాంతి గృహాల తాజా పరిస్థితులపై టీటీడీ ఇంజినీరింగ్ విభాగం అధికారుల వద్ద ఆరా తీశారు. పద్మావతి ప్రాంతంలో పర్యటించారు.
సాధారణ భక్తుల సౌకర్యార్థం ఆయా ప్రదేశాలలో విశ్రాంతి గృహాలను పునర్ నిర్మించడానికి నిర్దుష్ట ప్రణాళికను రూపొందించాలని టీటీడీ చీఫ్ ఇంజినీర్ సత్యనారాయణను ఆదేశించారు. సదరు విశ్రాంతి గృహాలన్నీ ఆరు దశాబ్దాల క్రితం నిర్మించినవి కావడం వల్ల వర్షాకాలంలో లీకేజీలతో భక్తులు అవస్థలు పడుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని వివరించారు.
సరైన పార్కింగ్ సదుపాయం లేకపోవడం, భవనాలను పాత పద్ధుల్లో లో నిర్మించడం వల్ల వాటి మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని వ్యాఖ్యానించారు. పాత భవనాల్లో లీకేజీలు, అపరిశుభ్ర వాతావరణం నెలకొని ఉందని, సరైన పార్కింగ్ స్థలం లేక భక్తులు అవస్థలు పడుతున్నట్లు గుర్తించారు.
వాటన్నింటిపైనా భక్తుల నుండి క్రమం తప్పకుండా టీటీడీకి ఫిర్యాదులు అందుతున్నాయని ఈ సందర్భంగా అధికారులు ఈవో దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా వాటిని పునర్నిర్మించాలని, దీనికి అవసరమైన నిర్దుష్ట ప్రణాళికను రూపొందించాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులకు ఈవో సూచించారు.












Click it and Unblock the Notifications