శ్రీవారి రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. వేలాదిమంది స్వామివారిని దర్శించుకుంటోన్నారు. తమ మొక్కులను చెల్లించుకుంటోన్నారు. మంగళవారం నాడు 63,665 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 18,630 మంది తలనీలాలను సమర్పించారు.
హుండీ ద్వారా 3.44 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం పట్టింది. రెండు కంపార్ట్‌మెంట్లల్లో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఈ వారాంతంలో భక్తుల సంఖ్య మరింత పెరుగుతుందని టీటీడీ అంచనా వేస్తోంది.

కాగా- ఈ ఏడాది ఏప్రిల్ నెలకు సంబంధించిన 300 రూపాయల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను టీటీడీ అధికారులు విడుదల చేశారు. ఈ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో వాటిని పొందుపరిచారు. టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా భక్తులు తమ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఏప్రిల్ నెలకు సంబంధించిన వసతి గదుల కోటా టికెట్లు ఈ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తాయి.
తిరుమల, తిరుపతిల్లో వేర్వేరుగా అనేక రకాల వసతి గదులు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. తిరుపతి ప్రధాన బస్టాండ్ సమీపంలో శ్రీనివాసం, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణువాసం వసతి భవనాలు ఉన్నాయి. ఈ రెండు చోట్లా గదులను బుక్ చేసుకోవచ్చు.
తిరుమలలో శ్రీ పద్మావతి అతిథిగృహం, శ్రీ వేంకటేశ్వర అతిథిగృహం, రామ్ బగీచా వరాహస్వామి విశ్రాంతి భవనం, ట్రావెలర్స్ బంగ్లా, నారాయణగిరి గెస్ట్ హౌస్, నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత, సప్తగిరి వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఆన్ లైన్ ద్వారా గదులను బుక్ చేసుకునే సౌకర్యం ఉంది.
శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ ఈ నెల 18వ తేదీన ఓపెన్ అయింది. శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ, సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధాన సేవల లక్కీడిప్ కోసం భక్తులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
ఏప్రిల్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్లు, సీనియర్ సిటిజన్లు/దివ్యాంగుల కోటా బుకింగ్ 23వ తేదీనాడే విడుదల అయ్యాయి. శ్రీవాణి ట్రస్ట్ దాతల కోసం కేటాయించిన దర్శనం, వసతి గదుల కోటా సైతం ఇదివరకే భక్తులకు అందుబాటులోకి వచ్చాయి.












Click it and Unblock the Notifications