తిరుమల హోటళ్లల్లో రేట్లు భారీగా తగ్గింపుపై టీటీడీ ఏం చెబుతోంది?
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. మంగళవారం నాడు 76,126 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 24,720 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.97 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో నాలుగు కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 10 నుంచి 12 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూలైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

కాగా- తిరుమలలో హోటళ్ల ధరలకు సంబంధించి కొంతకాలంగా సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతూ వస్తోన్న విషయం తెలిసిందే. తిరుమల కొండపై 17 పెద్ద, 8 చిన్న హోటళ్లు ఉన్నాయని, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు సుమారు 150, చిరు దుకాణాలు 30 ఉన్నాయని పేర్కొంటూ అందులో విక్రయించే ఆహార పదార్థాల రేట్లను గతంతో పోల్చారు.
ఇడ్లీ- 25 నుంచి రూ.7.50 పైసలు, చపాతి- 60 నుంచి 20 రూపాయలు, టీ 15 నుంచి అయిదు రూపాయలు, వెజిటెబుల్ బిర్యానీ- 50 నుంచి 19 రూపాయలు, ఉప్మా- 20 నుంచి 9 రూపాయలు, ప్లేట్ మీల్స్- 60 నుంచి రూ. 22.50 పైసలు, ఫుల్ మీల్స్- 100 నుంచి 31 రూపాయలకు తగ్గించారనేది ఆ వార్తల సారాంశం.
ఈ సమాచారాన్ని టీటీడీ తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. ఇది పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్పింది. భక్తులు ఎవరూ కూడా దీన్ని విశ్వసించవద్దని కోరింది. తిరుమలలో హోటళ్ల ధరల వివరాలు పేరుతో కొన్ని సోషల్ మీడియా వేదికల్లో విస్తృతంగా షేర్ అవుతున్న ఈ మెసేజ్ తమ దృష్టికి వచ్చిందని, ఈ సమాచారం పూర్తిగా వాస్తవ దూరమమని టీటీడీ తేల్చి చెప్పింది.
ఈ మెసేజ్‌లో పేర్కొన్న భోజన ధరలు, ఇతర వివరాలు పూర్తిగా కల్పితమని పేర్కొంది. ఈ విధమైన తప్పుడు ప్రచారాలతో భక్తులను గందరగోళానికి గురి చేస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది. భక్తులు ఎలాంటి సమాచారం అయినా అధికారికంగా టీటీడీ వెబ్‌సైట్ (www.tirumala.org), టీటీడీ కాల్ సెంటర్ (18004254141) ద్వారా మాత్రమే తెలుసుకోవాలని సూచించింది.












Click it and Unblock the Notifications