TTD: నాలుగేళ్లలో 4లక్షల బ్రేక్ దర్శనాలకు ఒక్కరే సిఫార్సు..!!
Tirumala: తిరుమల దర్శనాల్లో చోటు చేసుకున్న వ్యవహారాలను విజిలెన్స్ నివేదిక బయట పెట్టింది. ఇందులో పలు ఆసక్తి కర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న అయిదేళ్లు కాలంలో నాలుగేళ్లు వైవీ సుబ్బారెడ్డి .. ఆ తరువాత భూమన కరుణాకర రెడ్డి ఛైర్మన్లుగా వ్యవహరించారు. ఆ సమయంలో బ్రేక్ దర్శనాల అంశం పైన పలు ఆరోపణలు వచ్చాయి. దీని పైన విచారించిన విజిలెన్స్ అధికారులు తాజాగా పూర్తి వివరాలతో నివేదిక సమర్పించారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో శ్రీవారి దర్శన కోటా విషయంలో చోటు చేసుకున్న పలు కీలక అంశాలను విజిలెన్స్ బయట పెట్టింది. నాడు బోర్డు ఛైర్మన్ గా వ్యవహరించిన వైవీ సుబ్బారెడ్డి తన అధికారం దుర్వినియోగం చేసి పెద్ద సంఖ్యలో బ్రేక్ దర్శనాలకు సిఫార్సు చేసినట్లు గుర్తించారు. ఏడాదికి దాదాపుగా లక్ష మందికి బ్రేక్ దర్శనాలకు సిఫార్సు చేసిన వైవీ .. నాలుగేళ్ల కాలంలో నాలుగు లక్షల బ్రేక్ దర్శనాలు చేయించినట్లు నిర్ధారించారు. అదే విధంగా ప్రతీ రోజు రెండు నుంచి మూడు వేల వరకు రూ 300 దర్శన టికెట్లు ఇప్పించినట్లు తేల్చారు. ఇక, మాజీ మంత్రులు రోజా .. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సిఫార్సు లేఖలు భారీగా వచ్చాయని.. ఈ మేరకు దర్శనాల టికెట్లు జారీ అయ్యాయని పేర్కొన్నారు.

తిరుమల ప్రసాదాల ముడిసరుకుల్లోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయని విజిలెన్స్ తన నివేదిక లో వెల్లడించింది. టెండర్ ప్రమాణాలకు విరుద్ధంగా గుత్తేదారులు ద్వితీయశ్రేణి సరకు లిచ్చినా పట్టించుకోలేదని వివరించింది. ఇక, భూమన ఛైర్మన్ గా ఉన్న సమయంలో సత్రాల మరమ్మతులకు రూ. 30 కోట్ల 60 లక్షలు కేటాయించాలని నిర్ణయించారు. తిరుపతిలోని గోవిందరాజస్వామి, శ్రీకోదండరామస్వామి సత్రాలు కూల్చి రూ. 600 కోట్లతో అచ్యుతం, శ్రీపథం వసతిగృహాలు నిర్మించాలనే నిర్ణయం పైన విచారణ జరిగింది. మరమ్మతులు చేసే అవకాశం పరిశీలించకుండా.. కొత్త నిర్మాణాలకు టెండర్లు పిలవటం వెనుక కారణాలను విశ్లేషించింది. భారీగా ఇంజనీరింగ్ పనులకు నిధులు కేటాయించారని పేర్కొంది. ఈ నిర్ణయాలకు నాటి ఈవో ధర్మారెడ్డి మద్దతుగా వ్యవహరించారని విజిలెన్స్ నివేదికలో స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications