తెరాసలోకి ఇద్దరు ఎమ్మెల్యేలు, 9మంది ఎమ్మెల్సీలు
హైదరాబాద్: వివిధ పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బుధవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. ముందు ముందు తెరాసలోకి మరిన్ని భారీ వలసలు ఉంటాయని భావిస్తున్నారు.
బిఎస్పీ ఎమ్మెల్యేలు ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్ప, కాంగ్రెస్ ఎమ్మెల్సీలు రాజలింగం, ఆమోస్, భూపాల్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, భానుప్రసాద్, టీడీపీ ఎమ్మెల్సీలు సలీం, వెంకటేశ్వర్లు, పీఆర్టీయు ఎమ్మెల్సీలు జనార్ధన్ రెడ్డి, పూల రవీందర్‌లు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. వీరితో పాటు మాజీ ఎమ్మెల్సీలు మోహన్ రెడ్డి, ఇంద్రసేనా రెడ్డి, పలువురు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు తెరాసలో చేరారు.

కెసిఆర్ వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా భానుప్రసాద్ మాట్లాడుతూ... 1969లో తెలంగాణ ఉద్యమంలో ఉన్న పలువురు కూడా తెరాసలో చేరుతున్నారన్నారు. కెసిఆర్ తన కుటుంబాన్ని, జీవితాన్ని తెలంగాణ కోసం ధారపోశారన్నారు.
తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్సీలు ప్రధాన పాత్ర పోషించారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కెసిఆర్ కృషి ఎంత ఉందో, సోనియా కృషి అంతే ఉందని, అయితే తాము కాంగ్రెసు పార్టీ పట్ల అసంతృప్తితో తెరాసలో చేరడం లేదని, బంగారు తెలంగాణ కోసం చేరుతున్నామన్నారు. ఎపి సీఎం చంద్రబాబు కయ్యానికి కాలు దువ్వుతున్నారని ఆరోపించారు.
అదిలాబాద్ జిల్లాల్లో లక్షల ఎకరాలకు సాగునీరు తెరాసతోనే సాధ్యమని, బంగారు తెలంగాణ కెసిఆర్ వల్లే అవుతుందని ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బంగారు తెలంగాణ కోసమే తెరాసలో చేరానని చెప్పారు.












Click it and Unblock the Notifications