తమ షాపులో చికెన్ కొనలేదని వ్యక్తి హత్య: నిందితుడి తండ్రిని చంపేశారు
అనంతపురం: తమ షాపులో చికెన్ ఎందుకు కొనలేదని గొడవపడి ఓ వ్యక్తిని చంపేశాడు మరో వ్యక్తి. విషయం తెలుసుకున్న మృతుడి బంధువులో నిందితుడి కోసం గాలించి.. అతడు దొరక్కపోవడంతో అతడి తండ్రిని బండరాయితో మోది చంపేశారు. ఈ దారుణ ఘటనలు అనంతపురం జిల్లాలో చోటు చేసుకున్నాయి.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం కొడవాండ్లపల్లి గ్రామానికి చెందిన రామకృష్ణ (50) చికెన్ తీసుకొని ఇంటికెళుతున్నాడు. అటుగా వచ్చిన నాగముని అనే వ్యక్తి.. రామకృష్ణను అడ్డుకున్నాడు. ‘మా నాన్న దగ్గర చికెన్ ఎందుకు తీసుకోలేదు?' అంటూ వాగ్వాదానికి దిగాడు.

వాగ్వాదం పెరిగి పెద్దదై ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో నాగముని.. బండరాయి తీసుకొని రామకృష్ణ తలపై కొట్టాడు. తీవ్ర రక్తస్రావంతో రామకృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న రామకృష్ణ బంధువులు.. నాగముని ఇంటికి వెళ్లారు. అప్పటికే నాగముని ఊరి నుంచి పరారయ్యాడు. ఇంట్లో ఉన్న నాగముని తండ్రి పెద్దన్న (50) కనిపించాడు. ఆగ్రహంతో ఉన్న వారు బండరాయితో నెత్తిన మోది పెద్దన్నను దారుణంగా హత్య చేశారు. ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications