పెరుగుతున్న జగన్ బలం: సాక్షి ఫోకస్, వైసిపిలోకి ఉండవల్లి?
విజయవాడ: మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. గత రెండు రోజులుగా ఆయన మీడియాలో ప్రత్యేక హోదా, ఇతర అంశాల పైన మాట్లాడుతున్నారు.
వైసిపి అధినేత జగన్ అధికారిక ఛానల్ సాక్షి ఉండవల్లి సమావేశాన్ని పూర్తిస్థాయిలో ఫోకస్ చేసే ప్రయత్నాలు చేస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఉండవల్లి మీడియా సమావేశానికి అందరు ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ, సాక్షి మీడియా మరింత ఎక్కువ భుజానికి ఎత్తుకున్నట్లుగా కనిపిస్తోందంటున్నారు.
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి ఉండవల్లి సన్నిహితుడు. ఆయన మృతి అనంతరం, వైయస్ జగన్ కాంగ్రెస్ పార్టీని వీడాక... కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండవల్లి వైసిపి అధినేత పైన తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోసిన సందర్భాలు ఉన్నాయి.

అయితే, ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ పార్టీ కోలుకునే పరిస్థితి కనిపించడం లేదనో లేక టిడిపికి ప్రత్యామ్నాయం వైసిపి మాత్రమే అనో ఆయన జగన్ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. ఆయన మాట్లాడుతున్న తీరు కూడా అలాగే కనిపిస్తోందని అంటున్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్‌పై తమకు అభిమానం ఉండటం సహజమేనని, మా కళ్ల ముందు తిరిగిన కుర్రాడు, వైయస్ కొడుకు సీఎం అవుతాడంటే ఆనందిస్తామని వ్యాఖ్యానించడం గమనార్హం. సీఎం చంద్రబాబుతో తమకెప్పుడూ స్నేహ సంబంధాలు లేవని, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా పెద్ద పరిచయం లేదన్నారు.
ఇదిలా ఉండగా, ఇప్పటి వరకు వైసిపి నుంచి టిడిపిలోకి వలసలు వెల్లువెత్తాయి. ఇటీవల మాజీ ఎమ్మెల్యే టిడిపి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడం గమనార్హం. ఇప్పుడు కాంగ్రెస్ నేత ఉండవల్లి క్యూలో ఉన్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో వైసిపి ఏపీలో మరింత బలపడుతోందని అంటున్నారు.












Click it and Unblock the Notifications