వంగవీటి రంగాపై బురదజల్లితే తాట తీస్తాం: వర్మకు రాధా హెచ్చరిక, అనుమానం
విజయవాడ: వంగవీటి రంగా కథతో సినిమా తీస్తానన్న ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటన పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వంగవీటి రాధాకృష్ణ, ఆయన అనుచరులు, రంగా అభిమానులు ఆసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే సినిమాలో రంగా జీవితంపై బురదజల్లితే మాత్రం తాటతీస్తామని చెబుతున్నారు.
వంగవీటి రాధా మాట్లాడుతూ.. తన తండ్రి జీవితాన్ని నేపథ్యంగా చేసుకొని వర్మ సినిమా తీయడాన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. అయితే ఈ చిత్రంలో వాస్తవాన్ని చూపిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అంతేకానీ రంగా జీవితం పైన బురద జల్లే ప్రయత్నం చేస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు.

రంగా జీవితంపై బురద జల్లితే ఆయన కొడుకుగా అసలు ఊరుకునే సమస్య లేదన్నారు. రంగా అభిమానులు అంతకంటే ఎక్కువగా స్పందిస్తారని వంగవీటి రాధాకృష్ణ హెచ్చరించారు. వర్మ ఎటువంటి పక్షపాత ధోరణితో వ్యవహరిస్తారో అందరికీ తెలుసునని చెప్పారు.
ఏదో ఒక వర్గం వైపు వర్మ మొగ్గుచూపుతాడన్న సందేహాన్ని వంగవీటి అనుమానం వ్యక్తం చేశారు. తమ ఇంటి పేరుతో ఇష్టం వచ్చినట్లు సినిమాలు తీసి, అవాకులు చవాకులు పేలితే అభిమానులే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అభిమానులు ఎలా స్పందించినా తనకు బాధ్యత లేదన్నారు. ఇప్పటి వరకు వర్మ తనను లేదా తన కుటుంబ సభ్యులను సంప్రదించలేదన్నారు.












Click it and Unblock the Notifications