కేసీఆర్‌పై మండిపడ్డ వీరేందర్, రాజధాని భూమిపూజపై సీపీఎం హెచ్చరిక
హైదరాబాద్/అమరావతి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన టీడీపీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్ తనయుడు, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు వీరేందర్ గౌడ్ ఆదివారం మండిపడ్డారు. తెలంగాణ ద్రోహులను పార్టీలో చేర్చుకుంటూ అందలం ఎక్కిస్తున్నారన్నారు.
తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాలను కూడా పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణ ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని చెప్పిన కేసీఆర్, ఇప్పుడు ఉద్యోగాల మాటే ఎత్తడం లేదన్నారు.

వారి ఓటు మాకే: సంపత్
తమ పార్టీ నుండి తెరాసలో చేరిన ఎమ్మెల్యేలు కూడా తమ అభ్యర్థికే ఓటేస్తారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సంపత్ ఆశాభావం వ్యక్తం చేశారు.
గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్‌పై నిపుణులతో అవగాహన సదస్సు నిర్వహించామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తున్నామన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తప్పక విజయం సాధిస్తారని తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలకు పోలింగ్‌పై అవగాహన కల్పిస్తున్నామన్నారు. తమ పార్టీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేలు తమకే ఓటేస్తారన్నారు. పువ్వాడ అజయ్ ఓటింగ్ సమయానికి వస్తారన్నారు.
రాజధాని భూమి పూజ అడ్డుకుంటాం: రాఘవులు
ఏపీ రాజధాని భూమి పూజకు ముందే ఇక్కడి రైతులు, కూలీల సమస్యలు పరిష్కరించాలని సీపీఎం జాతీయ నేత రాఘవులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం నాడు ఏపీ నూతన రాజధాని ప్రాంతంలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం రైతుల సమస్యలు పరిష్కరించకుంటే జూన్ 6న జరిగే భూమి పూజను అడ్డుకుంటామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications