దక్కన్ క్రానికల్ చీఫ్ వెంకట్రామిరెడ్డి కస్టడీ కోరిన సిబిఐ
హైదరాబాద్: కెనరా బ్యాంక్ ఫిర్యాదుపై సిబిఐ నమోదు చేసిన కేసులో దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ చైర్మన్ టి వెంకట్రామ్ రెడ్డి, సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ టి రవి వినాయక్ రెడ్డిలకు 6వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ పి భాస్కర్‌రావు బుధవారం బెయిలు మంజూరు చేశారు.
దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ అధికారులు బెయిల్ కోసం రెండు దరఖాస్తులను మేజిస్ట్రేట్ ముందు సమర్పించారు. నేరశిక్షాస్మృతి (సిఆర్‌పిసి)లోని 167(2) సెక్షన్ కింద ఏడేళ్లకన్నా తక్కువ శిక్ష పడే కేసుల్లో దర్యాప్తు ఏజెన్సీ 60 రోజుల్లోగా చార్జిషీటు దాఖలు చేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఇ ఉమా మహేశ్వర్ రావు, ఎ చంద్రశేఖర్‌లు వాదించారు.
నిర్ణీత గడువులోగా చార్జిషీటు దాఖలు చేయని పక్షంలో నిందితులు బెయిలు పిటిషన్లను దాఖలు చేయవచ్చని, న్యాయమూర్తి వాటిని అదే రోజు విచారించాలని భారత ప్రభుత్వం వర్సెస్ నిరాలా యాదవ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని వారు ఉదహరించారు.

పిటిషనర్ల తరఫు వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి బెయిలు మంజూరు చేస్తూ ఐదు లక్షల రూపాయల చొప్పున నగదు డిపాజిట్ చేయాలని, అలాగే రెండేసి పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించారు.
అంతకు ముందు వెంకట్రామిరెడ్డి, అతని సోదరుడు రవి రెడ్డిని 14 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని సీబీఐ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దాని విచారణను కోర్టు 19వ తేదీకి వాయిదా వేసింది. అలాగే, వెంకట్రామి రెడ్డి, రవిరెడ్డి తమకు చంచల్ గూడ జైలులో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పైన విచారణను కోర్టు 18వ తేదీకి వాయిదా వేసింది.
నకిలీ పత్రాలతో దక్కన్ క్రానికల్ హోల్డింగ్‌స లిమిటెడ్ రూపొందిందని, ఈ వ్యవహారంలో తమకు రూ.357.77 కోట్ల మేర నష్టం వాటిల్లిందని బ్యాంక్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications