జగన్ కేసు: జైలు నుండి విజయ సాయి రెడ్డి విడుదల

విజయ సాయి రెడ్డికి మంగళవారం నాంపల్లి సిబిఐ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. 2లక్షల రూపాయలు, ఇద్దరు పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. హైదరాబాద్ విడిచి వెళ్లకూడదని, కేసు విషయంపై ఎవరితోనూ మాట్లాడరాదని సిబిఐ కోర్టు ఆదేశించింది.
ఒకవేళ హైదరాబాద్ విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడితే కోర్టు అనుమతి తీసుకోవాలని కోర్టు పేర్కొంది. గతంలో రెండుసార్లు బెయిల్‌పై విడుదలైన విజయ సాయి రెడ్డిని కేసు తీవ్రత దృష్ట్యా జైలుకు వెళ్లాలని కోర్టు ఆదేశించడంతో 4నెలలుగా జైల్లోనే ఉన్నాడు.
తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ విజయ సాయి రెడ్డి కోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ ఆరోపణలకు సంబంధించి ఏ చిన్న ఆధారాలు కూడా చూపించట్లేదని, బెయిల్‌ను అడ్డుకోవాలని సిబిఐ నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని సాయి రెడ్డి తరపు న్యాయవాది కోర్టుకు నివేదించారు.
విచారణను మంగళవారానికి వాయిదా వేసిన కోర్టు, షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన బుధవారం జైలు నుండి విడుదలయ్యారు. ఇటీవల ఆస్తుల కేసులో ప్రధాన నిందితుడు వైయస్ జగన్ కూడా షరతులతో కూడి బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. జగన్ అక్రమాస్తుల కేసులో నిందితులు నిమ్మగడ్డ ప్రసాద్, కెవి బ్రహ్మానంద రెడ్డిలు మంగళవారం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు.












Click it and Unblock the Notifications