గౌతమ్ అన్న పేరు నిలబెడతాను - నా గెలుపు వెనుక కారణమదే : విక్రమ్ ఎమోషనల్..!!
ఆత్మకూరు ఉప ఎన్నికలో మేకపాటి గౌతమ్ రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు. తొలి సారి ఎన్నికల బరిలో దిగి భారీ మెజార్టీ సాధించి రికార్డు క్రియేట్ చేసారు. గెలుపు సాధించిన తరువాత విక్రమ్ రెడ్డి కొంత ఎమోషనల్ అయ్యారు. తన సోదరుడు గౌతమ్ ను గుర్తు చేసుకున్నారు. గౌతమ్ అన్న పేరు నిలబెడతానంటూ ఉద్వేగానికి లోనయ్యారు. తన పైన ఇప్పుడు మరింత బాధ్యత పెరిగిందని చెప్పారు. తనను ఇంత భారీ మెజార్టీతో గెలిపించిన ఆత్మకూరు ప్రజలకు విక్రమ్ రెడ్డి కృతజ్ఞతలు చెప్పారు. తమ కుటుంబం పైన నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఎన్నికల్లో అధికార దుర్వినియోగం చేసారనే ఆరోపణల పైన స్పందించిన విక్రమ్ రెడ్డి.. ఎన్నికలు పారదర్శకంగా జరిగాయని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు తన గెలుపుకు కారణంగా పేర్కొన్నారు. సీఎం జగన్ పట్ల ప్రజలకు ఉన్న ఆదరణ తగ్గలేదని చెప్పుకొచ్చారు. సీఎం జగన్ అమలుచేస్తున్న నవరత్నాలే విజయానికి కారణమని స్పష్టం చేసారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఉనికి లేదని విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రానికి బీజేపీ తీవ్ర అన్యాయం చేసిందని... కేంద్రం ఇచ్చిన వాగ్దానాలను మరిచిపోయిందని దుయ్య బట్టారు.

ఏపీకి కేంద్రం సహకారం అందించి ఉంటే ఎంతో మేలు జరిగేదన్నారు. వైఎస్‌ఆర్ లేనిలోటు తీర్చగలిగే వ్యక్తి సీఎం వైఎస్ జగన్ ఒక్కరేనని... రాష్ట్రానికి సీఎం జగన్ నాయకత్వం అవసరమని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ వద్ద గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నాయని ప్రశంసించారు. చంద్రబాబుని రాష్ట్ర ప్రజలు నమ్మరన్నారు. భవిష్యత్తులో చంద్రబాబు అధికారంలోకి రావడం కల్ల అంటూ మేకపాటి విక్రమ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక, ఆత్మకూరు ఫలితం పైన స్పందించిన బీజేపీ అభ్యర్ది భరత్ కుమార్ యాదవ్ వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు.
ముఖ్యమంత్రి జగన్.. మంత్రులకు మెజార్టీ పైన నిర్దేశం చేసారని..సూచనలు ఇచ్చారని చెప్పుకొచ్చారు. మంత్రులు..ఎమ్మెల్యేలు వచ్చినా వారు ఆశించిన మెజార్టీ రాలేదని ఎద్దేవా చేసారు. వైసీపీ వాలంటీర్లు .. ఆశా వర్కర్లతో డబ్బులు పంపిణీ చేయించిందంటూ ఆరోపించారు. నైతికంగా విజయం తమదేనని భరత్ చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications