రెండు పాములు ఒకేసారి శివలింగాన్ని.. నాగుల చవితి నాడు అరుదైన దృశ్యం !
నాగుల చవితి పండుగను తెలుగు రాష్ట్రాల్లో భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటున్నారు. సాధారణంగా కార్తీక మాసంలో (అక్టోబర్/నవంబర్) దీపావళి అమావాస్య తర్వాత వచ్చే శుక్లపక్షం చతుర్థి రోజున జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో శ్రావణ శుద్ధ చతుర్థి రోజు కూడా ఈ పండుగను పాటిస్తారు, కానీ కార్తీక మాసపు చవితికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ క్రమంలోనే నేడు నెల్లూరులోని విశ్వనాథ స్వామి ఆలయంలో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది.
స్థానిక చెర్లోపల్లి రైల్వేగేట్ వద్ద ఉన్న ప్రసిద్ధ విశ్వనాథ స్వామి ఆలయంలో నాగుల చవితి నాడు భక్తులకు ఆశ్చర్యపరిచే ఘటన చోటు చేసుకుంది. రెండు నాగుపాములు శివలింగం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ భక్తుల ముందు కనిపించాయి. రెండు నాగు పాములు ఒకేసారి శివలింగాన్ని చుట్టుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొద్దిసేపటి తరువాత రెండు పాములు ఆలయం వెనుక ఉన్న పుట్టలోకి వెళ్లిపోయాయని తెలిపారు. ఆలయ అర్చకులు శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఈ అద్భుత దృశ్యం భక్తులకు ఆధ్యాత్మికంగా ఎంతో శక్తివంతమైన అనుభూతిని కలిగించిందన్నారు.

కాగా నాగుల చవితి రోజున భక్తులు, ముఖ్యంగా మహిళలు, ఊరి పొలాల వద్ద ఉన్న పాము పుట్టల వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. నాగదేవతకు పాలు, గుడ్లు, అరటిపండ్లు, నువ్వు, వడపప్పు వంటి ప్రసాదాలను సమర్పిస్తారు. పుట్టకు నూలు చుట్టి, పసుపు, కుంకుమలతో అలంకరించి మొక్కులు చెల్లించుకుంటారు. కాగా చాలా మంది మహిళలు పిల్లల ఆరోగ్యం, శ్రేయస్సు, దీర్ఘాయుష్షు కోసం ఆ రోజున పాక్షికంగా లేదా పూర్తిగా ఉపవాసం ఉంటారు. సాయంత్రం పూజలు పూర్తయ్యాక ఉపవాసాన్ని విరమిస్తారు. ఈ రోజున భూమిని దున్నడం, చెట్లను నరకడం, కూరగాయలు కోయడం వంటివి చేయకూడదని అనాదిగా ఆచారం ఉంది.
శివ, విష్ణువుతో అనుబంధం..
నాగేంద్రుడు సర్పరాజు అయిన ఆదిశేషుడు శ్రీ మహావిష్ణువుకు పరుపుగా, వాసు పాముని రూపంలో శివుడి మెడలో అలంకారంగా ఉండి సేవలు అందించారని పురాణాలు చెబుతాయి. అందుకే ఈ రోజున నాగదేవతలను పూజిస్తే శివ, విష్ణువుల అనుగ్రహం కూడా లభిస్తుందని నమ్మకం. అలానే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా నాగుల చవితి రోజున నాగదేవతలను పూజిస్తే రాహు, కేతు, నాగదోషం, కాలసర్పదోషం, కుజదోషం వంటి దుష్ప్రభావాలు తొలగిపోయి ఆరోగ్యం, శాంతి, కలుగుతుందని విశ్వసిస్తారు.












Click it and Unblock the Notifications