విశాఖ రాజధాని అవుతుందా - తేల్చి చెప్పేసిన సాయిరెడ్డి: ముందస్తుపైన మాత్రం..!!
ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం ఏమైంది. అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు ఉప సంహరణ..కోర్టు తీర్పుతో ఆ నిర్ణయం పెండింగ్ లో పడింది. ప్రభుత్వం సైతం హైకోర్టు తీర్పు పైన అప్పీల్ కు వెళ్లలేదు. కానీ, అమరావతి నిర్మాణం పైన కోర్టు తీర్పులో ఇచ్చిన సమయం 6 నెలల్లో పూర్తి చేయటం సాధ్యం కాదని.. 60 నెలలు కావాలంటూ అఫిడవిట్ దాఖలు చేసింది. ఇక, ఈ మూడు రాజధానుల అంశం పైన రాజకీయంగానూ చర్చ జరగటం లేదు. ఈ సమయంలో వైసీపీ ముఖ్యనేత..రాజ్యసభ సభ్యుడు సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు.

ఎవరు అడ్డుపడినా.. విశాఖనే పరిపాలనా రాజధాని
కొన్ని కారణాల వల్లే రాజధాని తరలింపు ఆలస్యమవుతోందన్నారు. ఎవరు అడ్డుపడినా.. విశాఖనే పరిపాలనా రాజధానిగా మారుతుందని మరోసారి స్పష్టం చేశారు. ఎవరు ఔనన్నా.. కాదన్నా విశాఖపట్నం పరిపాలనా రాజధాని అవుతుందని తేల్చి చెప్పారు. టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడుకి కోర్టులో తాత్కాలిక ఊరటే దక్కిందని సాయిరెడ్డి చెప్పుకొచ్చారు. పంట కాల్వను ఆక్రమించిన అయ్యన్నకు చట్ట ప్రకారం శిక్ష తప్పదని హెచ్చరించారు. ఇక, ప్రస్తుతం జాతీయ స్థాయిలో కీలకంగా మారిన రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ మద్దతు పైన ఆయన స్పందించారు.

ఎస్టీలకు అవకాశం దక్కితే
రాష్ట్రపతి ఎన్నికల్లో తాము ఎవరికీ మద్దతు ఇవ్వాలనే విషయాన్ని పార్టీ అధినేత జగన్ నిర్ణయిస్తారని చెప్పారు. సీఎం ఆదేశాల మేరకే తామంతా వ్యవహరిస్తామని స్పష్టం చేసారు. ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్రపతిగా అవకాశం ఇస్తామంటే ఎవరు వద్దంటారు. దశాబ్దాలుగా ఆ వర్గాలు సామాజికంగానూ, రాజకీయంగానూ పైకి వస్తామంటే అన్ని పార్టీలు సహకరిస్తాయన్నారు.అయితే, ముందస్తు పైన మాత్రం సాయిరెడ్డి సమాధానం దాట వేశారు. ముందస్తు ఎన్నికలు జరుగుతాయా..లేదా అనే దానికి ఆయన స్పష్టత ఇవ్వలేదు.
Recommended Video


ముందస్తు ఎన్నికలపైనా..
ఇప్పటికే ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయంటూ ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. కొందరు వైసీపీ ముఖ్యులు మాత్రం తమకు ప్రజలు అయిదేళ్లు సమయం ఇచ్చారని.. ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం లేదని చెబుతూ వచ్చారు. కానీ, అన్ని అంశాల పైనా ఓపెన్ గా సమాధానం ఇచ్చే విజయ సాయిరెడ్డి ముందస్తు పైన సమాధానం దాటవేయటంతో ప్రభుత్వంలో ఏం జరుగుతోందనే చర్చ ఆసక్తి కరంగా మారుతోంది. ముందస్తు ఎన్నికల దిశగా జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తుందా అనే చర్చ సైతం మొదలైంది.












Click it and Unblock the Notifications