ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పిన ఆ అరెస్ట్ ఎవరిదై ఉండొచ్చు..?!
విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది.
2014-2019 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, డొల్ల కంపెనీలను సృష్టించి, ముడుపులను పొందారనే ఆరోపణలు చంద్రబాబుపై ఉన్నాయి. దీనిపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆయనను కస్టడీలోకి తీసుకుని, దర్యాప్తు సాగిస్తోన్నారు.

ఈ పరిణామాలపై లోక్‌సభ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. అక్టోబర్ 30వ తేదీ లోపల మరో అరెస్ట్ ఉంటుందని, దాని తీవ్రత ఇంతకు మించి ఉండొచ్చనీ తేల్చారు. రాష్ట్ర రాజకీయ తీవ్రస్థాయిలో ప్రకంపనలను పుట్టించే అవకాశం ఉందనీ కూడా ఉండవల్లి అభిప్రాయపడ్డారు. ఈ అరెస్టు ఎవరిదై ఉండొచ్చనేది ఉండవల్లి బయటపెట్టలేదు.
ప్రస్తుతం ఉండవల్లి అరుణ్ కుమార్.. మార్గదర్శి చిట్ ఫండ్స్ వ్యవహారంపై పోరాడుతున్న విషయం తెలిసిందే. చిట్ ఫండ్స్ చట్టాన్ని ఆ సంస్థ ఛైర్మన్ రామోజీ రావు, మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్ సంవత్సరాల తరబడి అతిక్రమిస్తూ వస్తోన్నారనేది ఆయన ప్రధాన ఆరోపణ. ప్రజల నుంచి చిట్స్ రూపంలో వసూలు చేసిన మొత్తాన్ని రామోజీ రావు తన గ్రూప్‌లోనిఇతర సంస్థలకు మళ్లించారని విమర్శిస్తోన్నారు ఉండవల్లి.
ఒక్కరోజైనా రామోజీ రావు అరెస్ట్ కావాలని, చట్టానికి ఎవరూ అతీతులు కాబోరనే సందేశాన్ని ఈ దేశానికి పంపించాలని ముందు నుంచీ చెబుతోన్నారు. అదే సమయంలో- స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసులో మాజీ మంత్రి నారా లోకేష్‌కూ సంబంధం ఉందంటూ వార్తలొస్తోన్న నేపథ్యంలో- ఈ అరెస్ట్ ఎవరిదనేది చర్చనీయాంశమౌతోంది. అచ్చెన్నాయుడు కూడా అరెస్ట్ కావొచ్చని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications