టీపై మానవబాంబుతో చంపేస్తామన్నారు: వెంకయ్య
నెల్లూరు: రాజ్యసభలో తెలంగాణ బిల్లుపై జాప్యం చేస్తే మానవ బాంబుతో చంపేస్తామని తనకు బెదిరింపులు వచ్చాయని బిజెపి సీనియర్ నేత ఎం. వెంకయ్యనాయుడు చెప్పారు. నెల్లూరు జిల్లా ఎన్నికల ప్రచారంలో ఆయన బుధవారం ఈ విషయం చెప్పారు. తనకు బెదిరింపులు వచ్చినా తాను భయపడలేదని ఆయన అన్నారు.
వచ్చే ఎన్నికల్లో దేశంలో ఎన్డీయే కూటమికి 300 సీట్లు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా వేదాయపాలెంలో వెంకయ్య రోడ్‌షో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో బడ్జెట్ లోటును కేంద్రమే భరించేలా మోదీతో హామీ ఇప్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.

త్వరలో సీమాంధ్రలో నరేంద్ర మోడీ ప్రచారం చేయనున్నట్లు వెంకయ్య ప్రకటించారు. సీమాంధ్ర, తెలంగాణ ప్రజల శ్రేయస్సే కోరుతున్నానని, పదవులపై తనకు ఆశ లేదని తెలిపారు. తన కుమార్తెను ఎన్నికల బరిలో దింపాలని పలువురు కోరారని వెంకయ్య చెప్పారు.
రాజ్యసభలో సీమాంధ్ర కోసమంటూ వెంకయ్య నాయుడు పలు రాయితీలు, పథకాల కోసం పట్టుబట్టిన విషయం తెలిసిందే. ఆయన వల్లనే తెలంగాణ బిల్లు ఆమోదం విషయంలో రాజ్యసభలో జాప్యం జరుగుతోందనే అభిప్రాయం అప్పట్లో ఏర్పడింది.












Click it and Unblock the Notifications