ఏపీలో జర జాగ్రత్త
Heavy rains: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఉపరితల ద్రోణి పరిస్థితులు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకూ పలుచోట్ల వర్షాలు కురిశాయి. ప్రత్యేకించి- గుంటూరు, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాల్లో కుండపోతగా వర్షం కురిసింది. అటు విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి.
ఇప్పుడు తాజాగా బంగాళాఖాతం ఈశాన్య ప్రాంతంలో గురువారం నాటికి మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీనికి అనుకూల వాతావరణం నెలకొని ఉంది. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్రలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఎన్టీఆర్, ఏలూరు, తిరుపతి, నెల్లూరు, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని, 40-50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అన్నారు.
సోమవారం సాయంత్రం 6 గంటల నాటికి ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణానది వరద ప్రవాహం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3.87 లక్షల క్యూసెక్కులు ఉందని తెలిపారు. మరోవైపు గోదావారి వరద ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద సాయంత్రం 6 గంటలకు ఇన్ ఫ్లో 3.42, లక్షల క్యూసెక్కులు ఉందని ప్రఖర్ జైన్ అన్నారు. పెన్నానదికు కూడా వరద ప్రవాహం కొనసాగుతున్నందున ఆయా నదీపరీవాహక ప్రాంత, లోతట్టు గ్రామ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని సూచించారు.












Click it and Unblock the Notifications