దేశానికి తదుపరి ప్రధానమంత్రి ఎవరు? మోడీ కాదా?
ఎగ్జిట్ పోల్స్ తిరగబడ్డాయి. వారు చెప్పినట్లు భారతీయ జనతాపార్టీకి సొంతంగా 370 సీట్లు రాలేదు. ఒక్కసారిగా సన్నివేశం మొత్తం మారిపోయింది. దేశానికి తదుపరి ప్రధానమంత్రి ఎవరు? అనే చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. తాజాగా విడుదలైన ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమికి 295 సీట్లకు మించి దాటే పరిస్థితి కనపడటంలేదు. మరోవైపు ఇండియా కూటమి 230 నుంచి 240 వరకు సీట్లను గెలుచుకునే అవకాశం కనపడుతోంది.
టీడీపీ, జేడీయూ కీలకపాత్ర
ఎన్డీయే కూటమి 292 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. దాదాపు ఇన్నేస్థానాలను గెలుచుకునే అవకాశం కనపడుతోంది. పెరగడమైతే ఉండదు. కూటమిలో జేడీయూ నేతృత్వంలోని జేడీయూ, చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించబోతున్నాయి. భారతీయ జనతాపార్టీ ఒంటరిగా 242 సీట్ల దగ్గర ఆగిపోయే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 272 సీట్లు అవసరం. మరో 30 సీట్లు అదనంగా కావాల్సి ఉంటుంది. జేడీయూ, తెలుగుదేశం కలుపుకున్నా 8 స్థానాలు తక్కువవుతాయి.

ప్రజాదరణవల్ల మౌనం
ఎన్డీయే కూటమిలో ఉండే చాలాపార్టీలు ప్రధానమంత్రి మోడీ అభ్యర్థిత్వంపై అసంతృప్తితో ఉంటున్నాయి. అయితే ఆయనకు ప్రజాదరణ ఎక్కువగా ఉండటం ఏమీ మాట్లాడలేకపోతున్నాయి. అధికారాన్ని వదులుకోవడం ఇష్టంలేక వారుకూడా సర్దుకుపోయారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కనపడటంలేదు. బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి కేంద్రంలో అధికారాన్ని చేజక్కించుకోవాలంటే కూటమిలో ఉండే ప్రతి పార్టీ పాత్ర కీలకమే అవుతుంది.
మోడీకి మద్దతిస్తారా?
ఈసారి మాత్రం ఆయా పార్టీలు ప్రధానమంత్రిగా వేరొక వ్యక్తిని ప్రతిపాదించాలని కోరే అవకాశం కనపడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానమంత్రి పదవిని చేపట్టాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న నితీష్ కుమార్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? మోడీకి బదులుగా మరో పేరును ప్రతిపాదించాలని కోరతారా? లేదంటే మోడీకే మద్దతు తెలుపుతారా? ఎన్డీయే కూటమిలోని మోడీ వ్యతిరేకులంతా ఏకమవుతారా? లేదంటే తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చాలని మోడీకే జై కొడతారా? అనేది ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications