బాలయ్యపై చల్లారని మహిళాగ్రహం: నిర్భయ కేసు నమోదుకు ఫిర్యాదు
అనంతపురం/శ్రీకాకుళం: ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా హిందూపురంలో వైయస్సార్ కాంగ్రెస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళలు, విద్యార్థినులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాస్తారోకో నిర్వహించి ఆయన దిష్టిబొమ్మ దహనం చేశారు.
ఈ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత నాగమణి మాట్లాడుతూ.. 'అమ్మాయిలకు ముద్దయినా పెట్టుకోవాలి. కడుపైనా చేయాలి. కమిట్ అయిపోవాలి' అంటూ బాలకృష్ణ వ్యాఖ్యానించడం దారుణమని అన్నారు. మహిళల గురించి నిజజీవితంలో ఇంత హీనంగా మాట్లాడే ఆయన.. సినిమాల్లో మాత్రం పెద్ద పెద్ద డైలాగులు చెబుతారంటూ మండిపడ్డారు.

మహిళల అభివృద్ధి చంద్రబాబు వచ్చాకే అని గొప్పలు చెప్పారు కానీ, ఇప్పుడు మహిళలకు రక్షణే లేకుండా పోయిందని ఆరోపించారు. కాగా, రాస్తారోకో కారణంగా ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో వారే ర్యాలీ పోలీస్ స్టేషన్ వరకు వచ్చారు. మహిళలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణపై చర్యలు తీసుకోవాలని నిరసనకారులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
బాలకృష్ణపై చర్యలు తీసుకోండి
శ్రీకాకుళం: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. మహిళల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడిన బాలకృష్ణపై వెంటనే నిర్భయ కేసు నమోదు చేయాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
శ్రీకాకుళంకు చెందిన న్యాయవాది ఈశ్వరమ్మ స్థానిక టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం బాలకృష్ణపై ఫిర్యాదు చేయడానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమెతో పోలీసులు దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని ఆమె తెలిపారు.
ఇది ఇలా ఉండగా, తాను చేసిన వ్యాఖ్యలపై మహిళలకు చెబుతున్నానని రెండ్రోజుల క్రితం జరిగిన అసెంబ్లీలో సమావేశంలో తెలిపారు బాలకృష్ణ. తనకు మహిళలంతే చాలా గౌరవమని చెప్పారు.












Click it and Unblock the Notifications