యోగాంధ్ర-2026: ఈ సారి ఆ రికార్డులన్నీ బద్దలవ్వాల్సిందే!
కేవలం ఒక రోజు వేడుకగా ముగించకుండా.. ప్రతి ఇంటా, ప్రతి గుండెలో యోగాను ఒక జీవన విధానంగా మార్చేందుకు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 'యోగాంధ్ర-2026' పేరిట ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలని నిర్ణయించింది. జూన్ 21న జరిగే ప్రధాన వేడుక కంటే ముందే, జూన్ 7 నుండి జూన్ 20 వరకు రెండు వారాల పాటు రాష్ట్రవ్యాప్త అవగాహన యజ్ఞాన్ని ప్రారంభించనున్నారు. 'యోగా ఫర్ హెల్తీ ఏజింగ్' అనే నినాదంతో వృద్ధాప్యంలోనూ సంపూర్ణ ఆరోగ్యంతో ఎలా ఉండవచ్చో ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
ఇంటింటికీ డిజిటల్ యోగా.. స్మార్ట్ ట్రైనింగ్
ఈసారి యోగాను ప్రజల చెంతకు చేర్చడానికి సాంకేతికతను భారీగా వాడుకుంటున్నారు. ప్రభుత్వ సలహాదారు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు ప్రత్యేకంగా 4 కేటగిరీలలో రూపొందించిన వీడియోలను (90 సాధారణ ఆసనాలు, 21 రోగ నివారణ ఆసనాలు, 7 రోజువారీ సాధన సెట్లు, 50 సందేహాల నివృత్తి వీడియోలు) ప్రభుత్వం పూర్తి ఉచితంగా పంపిణీ చేస్తోంది. ప్రజలు 8142404888 నెంబరుకు వాట్సప్‌లో జస్ట్ 'Hi' అని మెసేజ్ చేయడం ద్వారా లేదా రాబోయే 'సంజీవని' యాప్ ద్వారా ఈ హెల్త్ కంటెంట్‌ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

బడి నుంచే ఆరోగ్యం.. విద్యాబోధనలో భాగం
భవిష్యత్ తరాల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ ఇప్పటికే ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థి దశ నుంచే యోగా అలవాటు అయ్యేలా పాఠశాలల నిత్య బోధనలో దీనిని అంతర్భాగం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి తోడు, రాష్ట్రంలో యోగాను నిరంతరం పర్యవేక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి సీఎం చంద్రబాబు నాయుడు 'ఏపీ యోగా ప్రచార పరిషత్' ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది 3 ప్రాంతీయ కార్యాలయాలతో నిరంతరం పని చేయనుంది. ఈ భారీ ఏర్పాట్లను మానిటర్ చేయడానికి మంగళగిరిలో ఒక ప్రత్యేక 'వార్ రూం' కూడా ఏర్పాటవుతోంది.
సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు.. సరికొత్త థీమ్స్
ఈ ఏడాది కోటి మందిని ఈ వేడుకల్లో భాగస్వాములను చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో రైతులు, మహిళలు, విద్యార్థులతో పాటు సమాజంలోని అన్ని వర్గాలను జోడించారు. అందుకోసం 28 జిల్లాల్లో 28 ప్రత్యేక ఇతివృత్తాలు (Themes) ఎంపిక చేశారు.
- పోలీసుల కోసం: డాక్టర్ ఎన్టీఆర్ జిల్లా
- రైతుల కోసం: కోనసీమ జిల్లా
- ఆటో, లారీ అసోసియేషన్ల కోసం: కృష్ణా జిల్లా
- సెలబ్రిటీల కోసం: తిరుపతి జిల్లా
- మాజీ సైనికోద్యోగుల కోసం: విశాఖపట్నం జిల్లా
వీరితో పాటు రాష్ట్రంలోని లేపాక్షి, ఉండవల్లి గుహలు, శ్రీశైలం, మైపాడు బీచ్ వంటి 56 ప్రముఖ పర్యాటక ప్రాంతాలలో ప్రతిరోజూ కనీసం 500 మందితో యోగా ప్రదర్శనలు నిర్వహించి పర్యాటక రంగానికి ఆధ్యాత్మిక శోభను చేకూర్చనున్నారు.
గ్రామం నుంచి రాజధాని దాకా.. అంచెలంచెలుగా పోటీలు
ప్రజల్లో ఉత్సాహాన్ని నింపేందుకు జూన్ 7 నుండి నాలుగు స్థాయిల్లో (గ్రామ/వార్డు, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి) యోగా, క్విజ్, వ్యాసరచన పోటీలు జరగనున్నాయి. విజయవాడలో జరిగే గ్రాండ్ ఫినాలే విజేతలను అమరావతిలో సీఎం చంద్రబాబు పాల్గొనే మెగా ఈవెంట్‌కు ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించనున్నారు.
కృష్ణా నదిపై మహా ప్రదర్శన
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు అమరావతిలోని కృష్ణా నది వంతెన (వెస్ట్రన్ బైపాస్ రోడ్) సరికొత్త రికార్డుకు వేదిక కానుంది. సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఏకంగా 25 వేల మంది ఇక్కడ యోగాసనాలు వేయనున్నారు. గతంలో 2 గిన్నిస్ రికార్డులు సాధించిన ఏపీ, ఈసారి కోటి మంది భాగస్వామ్యంతో మరో సరికొత్త మైలురాయిని అందుకోవడానికి సిద్ధమైంది.














Click it and Unblock the Notifications