విద్యార్థులకు శుభవార్త.. హైదరాబాద్ జీపీఓ మొబైల్ ఆధార్ సేవలు!
వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు, కళాశాలలు తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులకు శుభవార్త. విద్యార్థుల ఆధార్ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి హైదరాబాద్ జనరల్ పోస్ట్ ఆఫీస్ కీలకమైన కొత్త నిర్ణయం తీసుకుంది. ప్రధానోపాధ్యాయులు మరియు పాఠశాల యాజమాన్యాల అభ్యర్థన మేరకు నేరుగా స్కూల్ ప్రాంగణాల్లోనే మొబైల్ ఆధార్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు అన్ని రకాల ఆధార్ సేవలు అందించనుంది.
విద్యార్థుల ముంగిటకే ఆధార్ సేవలు
ఈ కొత్త సేవ ద్వారా విద్యార్థులు ఆధార్ సేవలు పొందవచ్చు. అవసరమైన పాఠశాలల్లో కొత్త ఆధార్ కార్డు నమోదు, బయోమెట్రిక్ అప్‌డేట్, ఫోటో మార్పు, పేరు సవరణ, తండ్రి పేరు మార్పు, అడ్రస్ అప్‌డేట్, సెల్‌ఫోన్ నంబర్ లింకింగ్, KYC అప్‌డేట్ వంటి అన్ని సేవలు ఒక్క చోట లభిస్తాయి. ముఖ్యంగా 5 ఏళ్లు మరియు 15 ఏళ్లు పైబడిన విద్యార్థులకు అవసరమైన బయోమెట్రిక్ అప్డేషన్ సులభంగా పూర్తి చేయవచ్చు.

హైదరాబాద్ GPO అబిడ్స్ కార్యాలయం వినూత్న ప్రయోగం
పాఠశాలలు ఈ సేవలను వినియోగించుకోవాలంటే హైదరాబాద్ GPO అబిడ్స్ కార్యాలయాన్ని ఫోన్ లేదా ఈమెయిల్ ద్వారా సంప్రదించాలి. దరఖాస్తు చేసిన 15 రోజుల్లోగా సంబంధిత పాఠశాలలో ఆధార్ క్యాంప్ ఏర్పాటు చేస్తారు. మొబైల్ నంబర్లు 76590 99628, 94404 54582, ల్యాండ్‌లైన్ నంబర్ 040 23463595కు కాల్ చెయ్యొచ్చు. ఈమెయిల్ [email protected] కు సంప్రదించవచ్చు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యార్థులకు భారీ ఉపశమనం
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో సుమారు 8 వేలకు పైగా ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. వీటిలో దాదాపు 25 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆధార్ కార్డుల్లో తప్పులు, బయోమెట్రిక్ నవీకరణల లోపాల వల్ల అడ్మిషన్లు, స్కాలర్‌షిప్‌లు, రాయితీలు పొందడంలో తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ నిర్ణయం వారికి భారీ ఉపశమనం కలిగిస్తుంది.
ఈ మొబైల్ ఆధార్ సేవలు విస్తరించాలనే అభిప్రాయం
ఇప్పటికే మీ-సేవా కేంద్రాల వద్ద గంటల తరబడి క్యూలు కడుతున్న సమస్యను పూర్తిగా తొలగించేలా ఈ మొబైల్ ఆధార్ సేవలు అన్ని చోట్లా అందుబాటులోకి వస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది . విద్యార్థులు చదువుపై పూర్తి దృష్టి పెట్టడానికి ఇది ఉపయోగపడుతుందని విద్యావేత్తలు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం విద్యార్థుల భవిష్యత్తుకు దోహదపడే ముఖ్యమైన అడుగుగా పరిగణించవచ్చు.













Click it and Unblock the Notifications