నేనే వస్తా- వైఎస్ జగన్ ఫోన్: పరిటాల కోటకు
YS Jagan: శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లాలో దారుణ హత్యకు గురైన వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త లింగమయ్య కుటుంబ సభ్యలను పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. వారికి ఫోన్ చేశారు. ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు.
సత్యసాయి పుట్టపర్తి జిల్లాలోని రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం, రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన కురుబ లింగమయ్య ఇటీవలే దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ నాయకుల చేతిలో ఆయన హత్యకు గురయ్యారంటూ కుటుంబ సభ్యులు ఆరోపించారు. రాజకీయ కక్షలే దీనికి కారణం అంటూ విమర్శించారు.

తాజాగా- కురుబ లింగమయ్య కుటుంబాన్ని వైఎస్ జగన్ ఫోన్‌లో పరామర్శించారు. లింగమయ్య భార్యతో పాటు, ఆయన ఇద్దరు కుమారులు శ్రీనివాసులు, మురళితో ఫోన్‌లో మాట్లాడారు. లింగమయ్య హత్యకు సంబంధించిన పూర్తి వివరాల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటన గురించి ఆరా తీశారు.
ఉగాది పండగ నాడు లింగమయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి గుడికి వెళ్లి వస్తోండగా, దారి కాచిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు దాదాపు 20 మంది తమ తండ్రిని దారుణంగా హతమార్చారని ఈ సందర్భంగా కురుబ శ్రీనివాసులు, మురళ.. వైఎస్ జగన్‌కు వివరించారు. అప్పటి నుంచి తామంతా భయాందోళనల్లో గడుపుతున్నామని అన్నారు.
దీనిపై జగన్ మాట్లాడుతూ- పార్టీ తప్పకుండా అండగా ఉంటుందని అన్నారు. అన్ని విధాల ఆదుకుంటుందని లింగమయ్య కుటుంబానికి భరోసా కల్పించారు. ఏ మాత్రం అధైర్యపడొద్దని, వచ్చే వారం స్వయంగా తాను వస్తానని వైఎస్ జగన్ ఆ కుటుంబానికి తెలిపారు.
గ్రామంలో తమకు రక్షణ లేదని, స్థానిక ఎస్ఐ పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తూ, తమను భయాందోళనకు గురి చేస్తున్నారంటూ లింగమయ్య కుమారులు జగన్ దృష్టికి తీసుకొచ్చారు. పార్టీ జిల్లా నేతలు, లీగల్‌సెల్‌ను అప్రమత్తం చేస్తామని, వారు తగిన రక్షణ కల్పిస్తారని ఈ సందర్భంగా జగన్ వారికి ధైర్యం చెప్పారు.












Click it and Unblock the Notifications