సమైక్యం: ఢిల్లీలో జాతీయ నేతలతో జగన్ చర్చలు
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ .. జాతీయ పార్టీల నేతలతో మంతనాలు జరుపుతున్నారు. సోమవారం పార్లమెంటు సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. లోక్‌సభ గంటసేపు వాయిదా పడడంతో ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్‌తో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా పార్లమెంటులో రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని ములాయంను జగన్మోహన్ రెడ్డి కోరారు. పార్లమెంటు సమావేశాలకు హాజరైన జగన్మోహన్ రెడ్డి తనకు వీలైన సమయంలో మరికొందరు జాతీయ పార్టీల నేతలను కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరనున్నట్లు సమాచారం. జగన్ సాయంత్రం మాజీ ప్రధాని దేవేగౌడను కలిశారు. సమైక్యాంధ్రకు మద్దతివ్వాలని కోరారు.

ఇటీవల జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర విభజను అడ్డుకోవాలని పలు జాతీయ పార్టీల నేతలను కలిసిన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మాజీ ప్రధాని దేవేగౌడ్, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ మొదలగు జాతీయ నేతలను కలిసిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని వారిని కోరారు.
కాగా సోమవారం పార్లమెంటు సమావేశాలు ప్రారంభంకాగానే సీమాంధ్ర ఎంపీలు సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేయడంతో లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ గంటపాటు సభను వాయిదా వేశారు. అనంతరం లోక్‌సభ సమావేశాలు ప్రారంభమైనా మళ్లీ సీమాంధ్ర ఎంపీలు సేవ్ ఆంధ్రపదేశ్ ప్ల కార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ సభను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. సీమాంధ్ర ఎంపీల ఆందోళన కొనసాగుతున్నా స్పీకర్ సభను కొనసాగించారు. ఆ తర్వాత ఉభయ సభలు మంగళవారానికి వాయిదా పడ్డాయి.












Click it and Unblock the Notifications