అది తప్ప.. మోడీతో చెప్పా: బీజేపీతో స్నేహంపై జగన్ కొత్త ట్విస్ట్
న్యూఢిల్లీ: బీజేపీకి తమకు కేవలం ఒకటి, రెండు విషయాల్లో మాత్రమే అభిప్రాయ బేధాలు ఉన్నాయని, అంతకుమించి ఎలాంటివి లేవని వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. అనంతరం మాట్లాడారు.
తమ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు ఏకంగా మంత్రి పదవులు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఖూనీ చేశారన్నారు. ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి చెప్పామన్నారు. పార్టీ ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు.

బీజేపీతో విభేదాలపై జగన్ సంచలనం
ప్రత్యేక హోదా, భూసేకరణ బిల్లు అంశాల పైనే తాము బీజేపీతో విభేదిస్తున్నామని జగన్ చెప్పారు. హోదా కోసం బీజేపీకి అండగా ఉంటామని చెప్పారు. బీజేపీతో ఈ అంశం మినహా విభేదాలు లేవని సంచలన ప్రకటన చేశారు. అంతకుమించి కమలం పార్టీతో ఎక్కడా తమకు తేడా లేదన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వగలిగే వ్యక్తి ప్రధాని అన్నారు. హోదా ఇస్తే మద్దతిస్తామని చెప్పామన్నారు. గత ప్రధాని హోదాపై హామీ ఇచ్చారమని మోడీకి గుర్తు చేశామన్నారు. ప్రత్యేక హోదా మరిచిపోలేని అంశమన్నారు. హోదాను బీజేపీ తన మేనిఫెస్టోలో పెట్టిందని గుర్తు చేశారు. తిరుపతి సభలోను మోడీ హామీ ఇచ్చారన్నారు. హోదాపై చంద్రబాబ ఎలాగు మాట్లాడరు కాబట్టి మీ బాధ్యతగా నెరవేర్చాలని కోరినట్లు చెప్పారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిస్తాం
రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తామని చెప్పారు. ప్రజలకు మంచి జరుగుతుందనుకుంటే బీజేపీకి అండగా ఉన్నామని, ఇక ముందు కూడా ఉంటామని జగన్ చెప్పారు. రాష్ట్రపతి పదవి వంటి ఉన్నత పదవికి పోటీ పెట్టడం సరికాదన్నారు. ఎన్డీయే వద్ద బలం ఉందన్నారు. అలాంటప్పుడు పోటీ పెట్టడంలో ఔచిత్యం లేదన్నారు. బీజేపీ అభ్యర్థికి మద్దతిస్తామన్నారు.

అగ్రిగోల్డ్ బాధితులకు..
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేసినట్లు జగన్ చెప్పారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో మంత్రులు, టిడిపి నేతలపై ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. మంత్రి నారా లోకేష్‌పై కూడా ఆరోపణలు ఉన్నాయన్నారు. వీటిపై విచారణ చేయాలని కోరినట్లు తెలిపారు.

మిర్చి రైతులపై..
మిర్చి రైతులను ఆదుకోవాలని తాము మోడీని కోరినట్లు తెలిపారు. వారికి రూ.8వేలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని చెప్పారు. పెద్దమనసుతో రైతులను ఆదుకోవాలని కోరినట్లు తెలిపారు. చంద్రబాబు ఎలాగూ చేయరు కాబట్టి రైతులను ఆదుకోవాలని కోరామన్నారు.












Click it and Unblock the Notifications