ఏపీలో భూవివాదాల ట్రైబ్యునళ్లు-శాశ్వతంగా పనిచేసేలా- జగన్ కీలక ఆదేశాలు
ఏపీలో వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకంపై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ ఇవాళ కీలక సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రజలందరికీ వివాదాల్లేకుండా భూహక్కులు కల్పించేందుకు వీలుగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సమీక్షించిన జగన్.. కొత్తగా వీటి కోసం శాశ్వత ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న సమగ్ర సర్వేపైనా అధికారులతో సమీక్షించారు.

భూములపై జగన్ సమీక్ష
రాష్ట్రంలో పలుచోట్ల తరచుగా తలెత్తుతున్న భూ వివాదాల పరిష్కారంపై సీఎం జగన్ ఇవాళ అధికారులతో సమీక్షించారు. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జగనన్న భూ రక్ష మరియు భూ హక్కు కింద సమగ్ర సర్వేతో పాటు పలు అంశాలపై జగన్ అధికారుల్ని వివరాలు అడిగి తెలుుకున్నారు. అనంతరం కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా భూవివాదాలు రాకుండా చూసేందుకు వీలుగా పలు చర్యలు సూచించారు. వీటిని తక్షణం అమలు చేయాలని ఆదేశించారు.

ప్రత్యేక శాశ్వత భూ ట్రైబ్యునళ్లు
రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న సమగ్ర భూ సర్వే సందర్భంగా తలెత్తే వివాదాల పరిష్కారానికి ప్రత్యేక ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు. వీటిని శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయాలన్నారు. మొబైల్ ట్రైబ్యునల్ యూనిట్లు ఉండాలని సీఎం సూచించారు. దీనిపై సమగ్ర కార్యాచరణ రూపొందించాలన్నారు. భూ వివాదాల పరిష్కారంపై రాష్ట్రంలో అత్యుత్తమ వ్యవస్థను తీసుకురావాలని కోరారు. శాశ్వత ప్రాతిపదికన ప్రతిమండల కేంద్రంలో కూడా భూ వివాదాల పరిష్కారానికి ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేయాలన్నారు. దీనివల్ల న్యాయపరంగా దక్కే హక్కులను వీలైనంత త్వరగా పొందేందుకు వీలు ఉంటుందన్నారు. వివాదాల్లో ఉండి తరాలతరబడి హక్కులు పొందలేని పరిస్థితి ఉండకూడదన్నారు.

ద్విముఖ వ్యూహం
రాష్ట్రంలో సమగ్ర సర్వే సందర్భంగా ప్రభుత్వంతో వివాదాలు, వ్యక్తిగత వివాదాల ఇలా అంశాల వారీగా గుర్తించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. సర్వే నంబర్ల జాబితాలో ఈ వివాదాలను కూడా పేర్కొనాలన్నారు. దీనివల్ల కొనుగోలుదార్లకు ఈ భూమి లీగల్‌గా క్లియర్‌గా ఉందా? లేదా? అన్నది తెలుస్తుందన్నారు. అదే సమయంలో ఆ వివాదాలను పరిష్కరించే ప్రయత్నంకూడా సమాంతరంగా జరగాలన్నారు. సర్వే ప్రక్రియలో నాణ్యత అనేది చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. వివాదాల పరిష్కారంలో కూడా అలాంటి క్వాలిటీతో కూడిన ప్రక్రియ ఉండాలన్నారు.
సమగ్ర సర్వే సందర్భంగా వచ్చే అప్పీళ్లపై థర్డ్‌పార్టీ పర్యవేక్షణ కూడా ఉండాలని సీఎం ఆదేశించారు. దీనివల్ల హక్కుదారులకు ఎలాంటి నష్టం చేకూరదని, తప్పులకు పాల్పడే సిబ్బందిపై కూడా చర్యలు తీసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. థర్డ్‌పార్టీ పర్యవేక్షణ వల్ల పక్షపాతం, వివక్ష, అవినీతికి ఆస్కారం లేకుండా ఉంటుందన్నారు. సిబ్బందిలో జవాబుదారీతనం కూడా వస్తుందన్నారు.

భూసర్వేపై జగన్ ఆదేశాలివే
ఎవరైనా ఒక వ్యక్తి తమ భూమిలో సర్వేకావాలని దరఖాస్తు చేసుకుంటే... కచ్చితంగా సర్వే చేయాలని, నిర్ణీత సమయంలోగా సర్వే చేయకుంటే సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు. దీనికోసం ఒక ఎస్‌ఓపీ రూపొందించాలని సీఎం ఆదేశించారు. సర్వేలో ఏరియల్ ఫ్లైయింగ్, డ్రోన్‌ఫ్లైయింగ్ నెలవారీ లక్ష్యాలను పెంచాలన్నారు. నెలకు వేయి గ్రామాలను చొప్పున ఇప్పుడు చేస్తున్నామని అధికారులు తెలిపారు. దీంతో ఈ లక్ష్యాన్ని పెంచాలన్నారు. మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో కూడా సర్వేను వేగవంతం చేయాలన్నారు. 2023 సెప్టెంబరు నెలాఖరు నాటికి సమగ్ర సర్వేను పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు. సమగ్ర సర్వే ప్రక్రియ సమర్థవంతంగా సాగడానికి ప్రఖ్యాత లీగల్ సంస్థల భాగస్వామ్యాన్ని కూడా తీసుకోవాలని సీఎం సూచించారు. దీనివల్ల క్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయన్నారు. సర్వే పూర్తయ్యే నాటికి గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సదుపాయం రావాలన్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మంచి ఎస్‌ఓపీలు పాటించాలన్న సీఎం... నమూనా డాక్యుమెంట్ పత్రాలను పౌరులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వాటి ఆధారంతో సులభంగా రిజిస్ట్రేషన్ జరిగేలా చూడాలని కోరారు. అవినీతికి, లంచాలకు ఆస్కారం లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపట్టాలన్నారు.సీఎం
ఈ మేరకు రిజిస్ట్రేషన్‌శాఖను ప్రక్షాళన చేయాలని సీఎం సూచించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కూడా ఏసీబీ నంబర్ స్పష్టంగా కనిపించేలా పోస్టర్, హోర్డింగ్ ఏర్పాటు చేయాలన్నారు.












Click it and Unblock the Notifications