ఏపీలో నాయీ బ్రహ్మణులను అలా పిలిస్తే చర్యలే-జగన్ సర్కార్ కీలక ఉత్తర్వులు
ఏపీలో గత ఎన్నికల్లో కుల సమీకరణాల్ని రంగరించి ఎన్నికల్లో ఘన విజయం అందుకున్న సీఎం జగన్ ఆ తర్వాత ఆయా కులాల్ని సంతృప్తి పరిచేందుకు కులాల వారీగా కొత్త కార్పోరేషన్ల ఏర్పాటుతో పాటు పలు చర్యలు తీసుకుంటున్నారు. వీటిలో పలు నిర్ణయాలు అధికార పార్టీ నేతల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఉంటుంటే మరికొన్ని మాత్రం స్వయంగా జగనే తీసుకుంటున్నారు. ఇదే క్రమంలో మరో తాజా నిర్ణయం వెలువడింది.
రాష్ట్రంలో సొంతంగా సెలూన్లు నడుపుకుంటున్న నాయీ బ్రహ్మణులకు ఇప్పటికే ఏడాదికి పది వేల రూపాయల సాయం అందిస్తున్న సీఎం జగన్.. ఇప్పుడు వారికి ఊరటనిచ్చే మరో నిర్ణయం కూడా తీసుకున్నారు. వారి ఆత్మగౌరవానికి భంగం కలుగుతుందన్న వాదన నేపథ్యంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇకపై వారంతా సమాజంలో మిగతా వారితో పాటు ఆత్మగౌరవంగా జీవించవచ్చని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇంతకీ ఆ నిర్ణయం ఏంటంటే నాయీ బ్రహ్మణుల్ని ఇప్పటికే సమాజంలో పలు పదాలతో జనం పిలుస్తున్నారు. వాటిని ఇకపై నిషేధించాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

జగన్ సర్కార్ తాజా ఉత్తర్వుల ప్రకారం ఇకపై నాయీ బ్రహ్మణుల్ని మంగలి, మంగలోడ, బొచ్చగొరిగావాడా, మంగలిది, కొండమంగలి అనే పదాలతో పిలవకూడదు. దీంతో ఈ పదాల వాడకాన్ని నిషేధించారు. ఈ పదాలతో వారిని ఎవరైనా పిలిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో హెచ్చరించింది. అయితే ఆగస్టు 7నే విడుదల చేసిన ఈ ఉత్తర్వులు తాజాగా వెలుగుచూశాయి. ఇప్పటికే చింతామణి నాటకం విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టులో పిటిషన్లు దాఖలు కావడం, రచ్చకావడం నేపథ్యంలో ఈ ఉత్తర్వుల్ని ప్రభుత్వం గుట్టుగా విడుదల చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications