రాళ్లతో కొడతారు, వారినీ వదల్లేదు!: చంద్రబాబుపై జగన్ తీవ్ర వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నాడు తీవ్రంగా మండిపడ్డారు.
కర్నూలు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నాడు తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు జనం మధ్యకు వస్తే రాళ్లతో కొడతారని హెచ్చరించారు.
కేబినెట్లో రైతు రుణమాఫీపై చర్చించడం లేదని, కానీ రైతుల భూములు ఎలా లాక్కోవాలనే దాని పైన చర్చిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైతులకు రుణమాఫీ పూర్తిగా కాలేదన్నారు. ఫీజు రీయింబర్సుమెంట్స్ లేక విద్యార్థులు చదువు మధ్యలో ఆపేస్తున్నారన్నారు.

జగన్ భరోసా యాత్ర
కర్నూలు జిల్లా ఆత్మకూరు రోడ్డులో జగన్ రైతు భరోసా యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కర్నూలు జిల్లాలో నలభై మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే చంద్రబాబు ప్రభుత్వం కేవలం నలుగురికి మాత్రమే రూ.5 లక్షల పరిహారం ఇచ్చిందన్నారు.

ఆదుకునే పరిస్థితి లేదు
రైతులు చనిపోతే ఆదుకునే పరిస్థితి లేదని ధ్వజమెత్తారు. రైతులకు తోడుగా నిలబడే పరిస్థితి లేదన్నారు. రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉందన్నారు. రైతులకు బేషరతుగా రుణమాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, కానీ నెరవేర్చలేదన్నారు.
బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని టీవీలలో చెప్పేవారని, గోడల మీద రాశారని గుర్తు చేశారు. రైతులను, డ్వాక్రా మహిళలను.. ఇలా అందర్నీ చంద్రబాబు మోసం చేశారన్నారు.

చంద్రబాబు వారినీ వదల్లేదు
చివరకు, చంద్రబాబు చదువుకునే పిల్లలను కూడా వదలలేదన్నారు. జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని చెప్పారని, కానీ ఆయన వచ్చాక ఉన్న ఉద్యోగాలు ఊడుతున్నాయన్నారు.
చంద్రబాబు మాత్రం సీఎం జాబ్ తీసుకొని కుర్చీలో కూర్చున్నారన్నారు. పిల్లల చదువు కోసం వైయస్ రాజశేఖర రెడ్డి ఫీజు రీయింబర్సుమెంట్స్ తెచ్చారన్నారు.
ఆరోగ్యశ్రీ పథకం విఫలమైన నెలల తరబడి నెట్ వర్క్ ఆసుపత్రులకు బిల్లులు కట్టక ఆ పథకం నీరసించిపోయిందన్నారు. డయాలసిస్ చేయించుకోవాల్సిన పేషెంట్లను ఏడాది తర్వాత రమ్మని ఆసుపత్రులు చెబుతున్నాయన్నారు.

చంద్రబాబు తీరు చూస్తుంటే..
చంద్రబాబు తీరు చూస్తుంటే ఇవాళ ఎంత డబ్బు సంపాదించాం, ఎంత మంది ఎమ్మెల్యేలను కొన్నాం, రాజకీయ వ్యవస్థను ఎంత భ్రష్టు పట్టించామని చూస్తున్నట్లుగా ఉందన్నారు. ఎమ్మెల్యేలను, ఎంపీలను కొంటే చాలదని, పేదవారికి మేలు చేయాలన్నారు.












Click it and Unblock the Notifications