కేసీఆర్ దారిలో..!: బాబుకు జగన్ లేఖ, ఉరితీయాలని గాలి ఆగ్రహం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం లేఖ రాశారు. ప్రభుత్వ ఆదాయ, వ్యయాల లెక్కలు ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆయన లేఖలో కోరారు.
బడ్జెట్ లెక్కల పైన కేంద్రం అనుసరిస్తున్న పద్ధతినే రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుసరించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. అప్పుడే పారదర్శకత ఉన్న పాలన కొనసాగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే పద్ధతి అనుసరిస్తోందని తెలిపారు. తమ విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించి ఏపీ ప్రభుత్వం కూడా ఈ విధానాన్ని అనుసరించాలన్నారు.
వ్యాపార దృక్పథం: ధర్మాన

రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం భూముల సేకరణలో వ్యాపార దృక్పథం స్పష్టంగా కనిపిస్తోందని వైసీపీ నేత ధర్మాన ప్రసాద రావు విమర్శించారు. రాజధాని ఏర్పాటు వల్ల దక్కే ప్రయోజనాలు రైతులకు మాత్రమే చెందాలన్నారు. చంద్రబాబు నిన్న చేసిన ప్రకటన ద్వారా ఇందులో ప్రయివేటు సంస్థలకు భాగస్వామ్యం ఉన్నట్లు స్పష్టమవుతోందన్నారు.
చట్టాలు పేదల ప్రయోజనాల కోసమన్నారు. రాజధాని నిర్మించ తలపెట్టిన గ్రామాలలోని చాలామంది రైతులలో అయోమయ పరిస్థితి నెలకొందన్నారు. రాజధాని ల్యాండ్ పూలింగు పైన ప్రభుత్వ విధాన ప్రకటనను తమ పార్టీ వ్యతిరేకిస్తుందని, రాజధాని పేరుతో వ్యాపారం చేస్తే ఊరుకోమన్నారు.
రెండు ప్రధాన కంపెనీలు రాజధాని నిర్మాణం చేపట్టనున్నట్లు అర్థమవుతోందన్నారు. వ్యాపార ప్రయోజనాల కోసం ఏపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతోందన్నారు. ప్రయివేటు వ్యక్తుల కడుపు నింపడమే లక్ష్యంగా ఏపి ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ప్రభుత్వం ధోరణి ప్రమాదకరమైనదని, చట్టబద్దత లేని వ్యవహారాలు సరికాదన్నారు.
జగన్, రఘువీరాలపై గాలి నిప్పులు
వైయస్ జగన్, ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డిలపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు మంగళవారం నిప్పులు చెరిగారు. తెలుగు రాష్ట్రాన్ని అక్రమంగా విభజించడానికి వీరిద్దరూ కారకులని ఆయన ఆరోపించారు.
వీరిద్దరూ గత పదేళ్లుగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని, అక్రమ దోపిడీలు, ఎర్రచందనం మాఫియా, ఇసుక మాఫియా అన్నీ జగన్ కనుసన్నల్లోనే నడిచాయన్నారు. తండ్రిని అడ్డం పెట్టుకుని జగన్ సంపాదించిన 43వేల కోట్ల ఆస్తిని జప్తు చేస్తే రైతుల రుణమాఫీ చేయవచ్చన్నారు. వీరిద్దరినీ నడిరోడ్డు మీద ఉరితీసినా తప్పు లేదన్నారు.
బాధితులను పరామర్శించిన మంత్రి అయ్యన్న
విశాఖపట్నంలోని పూర్ణామార్కెట్ రంగ్రీజు వీధిలో విషాదం చోటు చేసుకుంది. మంగళవారం ఓ గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఓ శిశువు మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన 13 మందిని కేజీహెచ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
గ్యాస్ సిలిండర్ రిపేర్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు తీవ్రంగా గాయపడిన బాధితులను మంత్రి అయన్న పాత్రుడు పరామర్శించారు. మెరుగైన చికిత్స అందజేయాలని వైద్యులను కోరారు. పేలుడు ఘటనపై జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసిన హోంమంత్రి చినరాజప్ప వివరాలు ఆరా తీశారు.












Click it and Unblock the Notifications