జగన్ ఛాంబర్‌లో కనిపించిన సజ్జల
YS Jagan Mohan Reddy: ఏపీ అసెంబ్లీ మొదలయ్యాయి. ఈ ఉదయం సరిగ్గా 9:45 నిమిషాలకు కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆరంభమైంది. మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించిన 175 మందీ శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి వారితో ప్రమాణం చేయిస్తోన్నారు.
శాసన సభలో తెలుగుదేశం పార్టీకి 134 మంది సభ్యుల బలం ఉంది. జనసేన- 21, భారతీయ జనతా పార్టీ-8 సభ్యులు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలకే పరిమితమైంది. వారందరూ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తోన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ ప్రమాణం చేశారు.

సభ్యుడిగా తన ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే వైఎస్ జగన్ నేరుగా గోరంట్ల బుచ్చయ్య చౌదరిని కలిశారు. ప్రొటెం స్పీకర్‌గా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ వెంటనే సభ నుంచి నేరుగా తన అసెంబ్లీ ఆవరణలో ఉన్న తన ఛాంబర్‌కు వెళ్లిపోయారు.
కొత్తగా సభకు ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి- పుంగనూరు, పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి- తంబళ్లపల్లి, వై బాలనాగిరెడ్డి-మంత్రాలయం, ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి- రాజంపేట, డాక్టర్ దాసరి సుధ- బద్వేలు, విరూపాక్షి- ఆలూరు, తాటిపత్రి చంద్రశేఖర్- యర్రగొండపాలెం, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి- దర్శి, రేగ మత్స్యలింగం- అరకు, మత్స్యరాస విశ్వేశ్వరరాజు- పాడేరుతో సమావేశం అయ్యారు.
దువ్వాడ శ్రీనివాస్, తోట త్రిమూర్తులు సహా పార్టీ ఎమ్మెల్సీలు ఇందులో పాల్గొన్నారు. అసెంబ్లీ, శాసన మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై జగన్ వారితో చర్చించారు. అధికార టీడీపీ కూటమి ఇచ్చిన హామీలు చేయడంపైనే ప్రధానంగా దృష్టి సారించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ఎమ్మెల్యేల సంఖ్య పరిమితంగానే ఉన్నందున అధికార సభ్యులు రెచ్చగొట్టేలా వ్యవహరించే అవకాశం లేకపోలేదని, అలాంటి పరిస్థితుల్లో సంయమనం పాటిద్దామని జగన్ అన్నారు. సబ్జెక్ట్‌పై అవగాహన పెంపొందించుకోవాలని, అంశాలవారీగా ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగాలని సూచించారు.
ఇదే సమావేశంలో వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సైతం పాల్గొనడం చర్చనీయాంశమైంది. సజ్జల హాజరు కావడం పట్ల వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఆయనపై ఘాటు కామెంట్లు పడుతున్నాయి. సజ్జల సరైన సలహాలు ఇవ్వకపోవడం, వాస్తవ పరిస్థితులను జగన్ దృష్టికి తీసుకెళ్లకపోవడం వల్లే పార్టీ ఓడిపోయిందనే విషయాన్ని క్యాడర్ బలంగా నమ్ముతోందని అంటున్నారు.












Click it and Unblock the Notifications