రెడ్ల కంచుకోటలో హ్యాట్రిక్ పై వైసీపీ గురి ! ఫైర్ బ్రాండ్ పైనే టీడీపీ ఆశలు..!
ఏపీలో గతంలో మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం పాణ్యం. నంద్యాల లోక్ సభ పరిధిలోకి వచ్చే పాణ్యం నియోజకవర్గం 1967లో ఏర్పాటైంది. అప్పటి నుంచి ఇక్కడ రెడ్లే గెలుస్తూ వస్తున్నారు. ఈ నియోజకవర్గం పరిధిలోకి కల్లూరు, ఓర్వకల్లు, పాణ్యం, గడివేముల మండలాలు వస్తాయి. దాదాపు 3 లక్షల మంది ఓటర్లు ఉంటారు. జనాభా పరంగా చూస్తే మాదిగ, ముస్లిం ఓటర్లు ఇక్కడ ఎక్కువ. కానీ రాజకీయంగా చూస్తే రెడ్లదే ఆధిపత్యం.
టీడీపీ ఆవిర్భావానికి ముందు పాణ్యం అసెంబ్లీ సీటులో మూడు ఎన్నికలు జరిగితే 1967, 1972లో కాంగ్రెస్, 1978లో జనతాపార్టీ తరఫున అయ్యపురెడ్డి ఇక్కడి నుంచి గెలిచారు. టీడీపీ పుట్టాక 1993లో జరిగిన ఉప ఎన్నికతో పాటు మొత్తం 10 ఎన్నికలు జరిగాయి. ఇందులో టీడీపీ కేవలం రెండుసార్లే (1983, 1999) గెలిచింది. కాంగ్రెస్ ఆరుసార్లు (1985, 1989, 1993, 1994, 2004, 2009), వైసీపీ రెండుసార్లు (2014, 2019) లో గెలిచాయి. కాటసాని రాంభూపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఐదుసార్లు, వైసీపీ నుంచి ఓసారి గెలిచారు.

వైసీపీ ఆవిర్బావం తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో గెలిచిన గౌరు చరితారెడ్డి అనంతరం టీడీపీలోకి ఫిరాయించి 2019లో ఓడిపోయారు. అలాగే 2019లో వైసీపీ టికెట్ పై పోటీ చేసిన కాటసాని రాంభూపాల్ రెడ్డి గెలిచారు. ఈసారి ఎన్నికల్లో కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీ అభ్యర్ధిగానూ, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీ అభ్యర్ధిగానూ పోటీ చేసే అవకాశముంది. గతంలో 2009లో వీరిద్దరి మధ్య జరిగిన పోరులో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన కాటసాని 8914 ఓట్ల తేడాతో గెలిచారు. ఈసారి కూడా కాటసానికే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు.












Click it and Unblock the Notifications