మళ్లీ పేట నుంచే పోటీ: మాట ఇచ్చిన లావు కృష్ణదేవరాయలు
Lavu Krishna Devarayalu: పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ లోక్‌సభ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు.. బహిరంగ లేఖ రాశారు. పల్నాడు ప్రాంత ప్రజలను ఉద్దేశించి రాసిన లేఖ ఇది. కీలక అంశాలను ఇందులో ప్రస్తావించారు. వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన నేపథ్యంలో- తన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఏమిటనేది పొందుపరిచారు.
చంద్రబాబు నాయుడి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరబోతోన్నట్లు ప్రకటించారు లావు కృష్ణదేవరాయలు. దీనికోసం త్వరలోనే జిల్లాలో భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నానని అన్నారు. మరోసారి నరసరావుపేట లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తాననే ధీమాను వ్యక్తం చేశారు.

అయిదు సంవత్సరాలుగా తనపై చూపించిన ప్రేమాభిమానాలు, ఆదరణను ఇప్పుడు కూడా కొనసాగించాలని పల్నాడు ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేశారాయన. ఈ అయిదేళ్ల కాలంలో ఎదురైన సవాళ్లను సోపానాలుగా స్వీకరించి.. ఈ ప్రాంత అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తానని చెప్పారు. ఈ క్రమంలో కొన్ని హామీలను ఇచ్చారు లావు.
ఇప్పటికే అనుమతులు లభించిన వరికపూడిశెల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసి, పల్నాడు ప్రాంతవాసుల చిరకాల కోరికను నెరవేరుస్తానని అన్నారు. జల్‌జీవన్ మిషన్ ద్వారా పనులు పూర్తయిన గ్రామాల్లో 1,200 కోట్ల రూపాయల వ్యయంతో వాటర్ గ్రిడ్‌లను ఏర్పాటు చేస్తానని, నాగార్జున సాగర్ నుంచి పైప్‌లైన్ ద్వారా మంచినీటిని అందిస్తానని అన్నారు.
సాగర్ కుడికాలువను స్థిరీకరించి నకిరేకల్లు దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ పద్ధతిలో నీటిని చేరవేస్తానని, వర్షాభావ సమయాల్లో కూడా రైతులకు పుష్కలంగా సాగునీటిని అందిస్తానని లావు హామీ ఇచ్చారు. 3,000 కోట్ల రూపాయల వ్యయంతో మంజూరైన జాతీయ రహదారులు, 500 కోట్ల రూపాయల వ్యయంతో పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ నిర్మాణాలను పూర్తి చేసి త్వరలోనే అందుబాటులోకి తెచ్చేలా చేస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications