క్యా సీన్ హై: సోనియాతో రఘురామ- సీఎం రమేష్‌తో సాయిరెడ్డి- తొలిరోజే ఆప్యాయత..!!
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభల్లో వైఎస్ఆర్సీపీ సభ్యులు ఎదురుపడ్డారు. సోనియా గాంధీని పలకరించారు.
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఇవ్వాళ ఆరంభం అయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తోన్నారు. వచ్చే సంవత్సరం సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న నేపథ్యంలో- ఈ సమావేశాలను ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అటు ప్రతిపక్ష పార్టీలు కూడా సమరానికి సన్నద్ధమౌతోన్నాయి. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలను ప్రధాన అస్త్రాలుగా మలచుకుంటోన్నాయి.

ధరల మీద..
నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల, జీఎస్టీ, పెట్రోల్-డీజిల్ రేట్లు.. ఇవన్నీ ఉభయసభల్లో ప్రస్తావనకు తీసుకుని రానున్నారు. సరిహద్దుల్లో చైనా దూకుడును ప్రదర్శిస్తోండటం, నానాటికీ పడిపోతూ వస్తోన్న రూపాయి విలువ, ఇతర అంశాలపై అధికార పార్టీని ఇరుకున పెట్టేలా వ్యవహరించడం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి అనుగుణంగా వ్యూహాలను రూపొందించుకున్నాయి. భారత్ జోడో యాత్ర పూర్తయినందున రాహుల్ గాంధీ ఈ సమావేశాలకు హాజరు కానున్నారు.

ద్రౌపది ముర్ము ప్రసంగం..
తన ప్రసంగంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రగతి, ఉగ్రవాదం, జీ20 సదస్సు, వైద్యారోగ్యం, ఆయుర్వేదం, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలు, ఆత్మనిర్భర్ భారత్, రక్షణ రంగాల గురించి తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకున్న కఠిన వైఖరిని ప్రపంచ దేశాలు అనుసరిస్తోన్నాయని అన్నారు. ప్రపంచంలోనే అంతరిక్ష శక్తిగా ఎదిగే దిశగా వేస్తోన్నామని, ఇందులో భాగంగా ప్రైవేటు ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించామని గుర్తు చేశారు.

ఆసక్తికర సన్నివేశాలు..
రాష్ట్రపతి ప్రసంగం సందర్భంగా కొన్ని ఆసక్తికర సన్నివేశాలు కనిపించాయి. ద్రౌపది ముర్ము గౌరవ వందనాన్ని స్వీకరించే సమయంలోనే సభ్యులందరూ తమకు కేటాయించిన స్థానాల్లో కూర్చున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్ భవనానికి చేరుకున్నారు. కొద్దిసేపటికే కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కారులో పార్లమెంట్ ప్రాంగణానికి చేరుకున్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లోకి వెళ్లారు.

పలకరించిన రఘురామ..
పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో తనకు కేటాయించిన స్థానంలో సోనియా గాంధీ ఆసీనులయ్యారు. ఆ వెనుక స్థానంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు సభ్యుడు రఘురామ కృష్ణంరాజు కూర్చున్నారు. సోనియా గాంధీకి నమస్కారం పెట్టారు. ఆప్యాయంగా పలకరించారు. పలకరింపుల తరువాత తమ స్థానాల్లో ఆసీనులయ్యారు.

అదే వరసలో..
రఘురామ కృష్ణంరాజు కూర్చున్న అదే వరసలో వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ చీఫ్ వీ విజయసాయి రెడ్డి ఆసీనులయ్యారు. ఆయన పక్కనే భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కూర్చున్నారు. విజయసాయి రెడ్డి- సీఎం రమేష్ కొద్దిసేపు ముచ్చటించుకోవడం కనిపించింది. వారంతా ద్రౌపది ముర్ము ప్రసంగాన్ని శ్రద్ధగా ఆలకించారు. మధ్యమధ్యలో బల్లలు చరుస్తూ ప్రసంగాన్ని స్వాగతించారు. ఏపీకి చెందిన సభ్యులు తొలి రోజే అందరి దృష్టిని ఆకట్టుకున్నట్టయింది.












Click it and Unblock the Notifications