వైసీపీ ఆపరేషన్ పిఠాపురం - వర్మ కేంద్రంగా, కీలక మలుపు..!!
ఏపీ ఎన్నికల రాజకీయం అనూహ్య మలుపులు తిరుగుతోంది. టీడీపీ,జనసేన అభ్యర్దుల ప్రకటన తుది దశకు చేరింది. పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఆ వెంటనే పిఠాపురం లో టీడీపీ శ్రేణులు నిరసనలకు దిగారు. చంద్రబాబు అలర్ట్ అయ్యారు. తన వద్దకు రావాల్సిందిగా వర్మకు సూచించారు. ఇటు వైసీపీ అక్కడి పరిణామాలను అనుకూలంగా మలచుకొనే ప్రయత్నం చేస్తోంది. కొత్త వ్యూహాలు సిద్దం చేస్తోంది.
పిఠాపురం రాజకీయం
పిఠాపురం నుంచి ఇప్పటికే వైసీపీ ఎంపీ గీతను బరిలోకి దించింది. ఇప్పుడు పవన్ కల్యాణ్ అక్కడ నుంచి బరిలోకి దిగనుండటంతో గెలుపును వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొంది. కొత్త ఆపరేషన్ ప్రారంభించింది. ఇప్పటికే గోదావరి జిల్లాల ఇంఛార్జ్ గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి ప్రత్యేకంగా పిఠాపురం పైన ఫోకస్ చేసారు. పవన్ పోటీ చేస్తే...ఎలాంటి సమీకరణాలు చోటు చేసుకుంటాయనే అంశం పైన నియోజకవర్గ నేతలతో సమీక్ష చేసారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ సేవలను ఇక్కడ ఏ విధంగా ఉపయోగించుకోవాలనే దాని పైన ఒక అంచనాకు వచ్చారు. స్థానికంగా సామాజిక సమీకరణాలు..గ్రామాల వారీగా ఎలక్షరీంగ్ పైన నేతలతో చర్చలు చేస్తున్నారు. తమతో కలిసి వచ్చే నేతల పైన గురి పెట్టారు.

వైసీపీ కొత్త స్కెచ్
పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం ఓటర్లలో కాపు సామాజికవర్గం సుమారుగా 30 శాతం వరకు ఉండగా, మాలలు 12 శాతం, శెట్టి బలిజలు, చేనేతలు బెస్తలు సుమారు 10 శాతం చొప్పున ఉన్నారు. ఆ తర్వాత స్థాయిలో రెడ్డి, యాదవ తూర్పు, తూర్పు కాపులు , మాదిగలు గణనీయ స్థాయిలో ఉన్నారు. పవన్ కు మద్దతుగా మెజార్టీ కాపు వర్గం నిలిచే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. అయితే, వర్మ నిర్ణయం ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ కానుంది. వర్మ ఈ రోజు తన మద్దతు దారులతో సమావేశం ఏర్పాటు చేసారు. వర్మను స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేయాలని మద్దతు దారులు కోరుతున్నారు. 2014లోనూ ఇదే తరహా కూటమి పోటీ చేసిన సమయంలో వర్మకు సీటు దక్కలేదు. దీంతో, స్వతంత్రగా పోటీ చేసిన వర్మ విజయం సాధించారు. ఇప్పుడు అదే రిపీట్ చేద్దామని వర్మ మద్దతు దారులు ఒత్తిడి చేస్తున్నారు.
వర్మ నిర్ణయమే కీలకం
అయితే, వర్మను తన వద్దకు రావాల్సిందిగా చంద్రబాబు సూచించారు. మద్దతు దారులతో సమావేశం తరువాత వర్మ టీడీపీ అధినేత చంద్రబాబును కలిసే అవకాశం ఉంది. పవన్ పోటీ చేస్తుండటంతో సహకరించాలని చంద్రబాబు కోరే అవకాశం ఉంది. కానీ, వర్మ ఈ ఎన్నికల్లో పవన్ కు మద్దతిస్తారా..స్వతంత్రంగా బరిలోకి దిగుతారా అనేది ఉత్కంఠ పెంచుతోంది. గీత 2009లో ప్రజారాజ్యం నుంచి పిఠాపురం ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పటికే అక్కడ కాపుల్లో మద్దతు సంపాదించారు. వైసీపీ ఓట్ బ్యాంక్ ఉంది. గీత అభ్యర్దిగా కొనసాగనున్నారు. ముద్రగడ చేరిక తరువాత కొన్ని నిర్ణయాలు తీసుకొనే ఛాన్స్ ఉంది. అయితే, వర్మ నిర్ణయం ఆధారంగా వైసీపీ పిఠాపురంలో స్కెచ్ అమలు చేసేందుకు సిద్దమైంది.












Click it and Unblock the Notifications