జగన్ కు అదానీ లంచాలు అబద్ధం-వైసీపీ వివరణ ఇదే..!
ఏపీలో సౌరశక్తి ప్రాజెక్టుల ఏర్పాటు కోసం గతంలో వైసీపీ ప్రభుత్వానికి అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతం అదానీ రూ.1750 కోట్ల మేర లంచాలు ఇచ్చినట్లు అమెరికా కోర్టులో ఎఫ్బీఐ దర్యాప్తు ఆధారంగా నమోదు చేసిన అభియోగాలపై వైసీపీ స్పందించింది. అప్పట్లో ఏం జరిగిందో పూస గుచ్చినట్లు వివరిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో సౌర శక్తి ఒప్పందాలపై అసలేం జరిగింది, అసలు లంచాలు స్వీకరించడానికి ఆస్కారం ఉందా లేదా అన్న విషయాల్ని సమగ్రంగా ప్రస్తావించింది.
ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ సంస్థలు వ్యవసాయ రంగానికి సంవత్సరానికి 12,500 మెగావాట్ల ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాయని, ఈ విషయంలో, ప్రభుత్వం పంపిణీ వినియోగాలకు ఆ విద్యుత్తుకు సంబంధించిన సరఫరా ఖర్చు మేరకు పరిహారం చెల్లిస్తుందని వైసీపీ తెలిపింది. రాష్ట్రంలో గత ప్రభుత్వాల విధానాల కారణంగా, అధిక టారిఫ్‌లతో విద్యుత్ ఒప్పందాలు అమలు చేశారని, రాష్ట్ర డిస్కమ్‌లపై ఇవి ప్రభావం చూపకుండా, పంపిణీ వ్యయంలో భాగంగా విద్యుత్ కొనుగోలు ఖర్చు దాదాపు రూ. కిలోవాట్ కు రూ.5.10 చొప్పున చెల్లించడం ప్రభుత్వానికి భారంగా మారిందని వెల్లడించింది.

ఈ సమస్యను తగ్గించే ఉద్దేశ్యంతో 2020లో అప్పటి వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి చేసే సోలార్ పార్కులలో 10,000 మెగావాట్ల సోలార్ సామర్థ్యాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. దీనికి సంబంధించి, APGECL ద్వారా నవంబర్ 2020లో 6,400 మెగావాట్ల సౌరశక్తి అభివృద్ధి కోసం టెండర్‌లు పిలిచిందని తెలిపింది. ఇందులో 24 బిడ్‌లు కిలో వాట్ కు రూ.2.49 నుండి రూ.2.58 చెల్లించేలా వచ్చాయి. టెండర్‌కు చట్టపరమైన, నియంత్రణ పరంగా ఎదురైన అడ్డంకులతో ఈ ప్రయత్నం ఫలించలేదని తెలిపింది.
ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ను కిలో వాట్ కు రూ.2.49 చొప్పన 25 ఏళ్ల కాలానికి కొనుగోలు చేసేలా నిర్ణయం తీసుకున్నట్లు వైసీపీ తెలిపింది. ఇందులో కిలో వాట్ కు రూ.2.49 చొప్పున 2024-25లో 3,000 మెగావాట్లతో ప్రారంభించి, 2025-26లో 3,000 మెగావాట్లు, 2026-27 లో 1,000 మెగావాట్లు ఇచ్చేలా నిర్ణయించినట్లు పేర్కొంది. దీన్ని ఏపీఈఆర్సీ కూడా ఆమోదించినట్లు వెల్లడించింది.
తర్వాత కేంద్ర ఈఆర్సీ ఆమోదంతో 2021 డిసెంబర్ 1న సెకీ, ఏపీ డిస్కమ్ ల మధ్య ఒప్పందం జరిగినట్లు వెల్లడించింది. తర్వాత ఏపీ డిస్కమ్‌లు, అదానీ గ్రూప్‌కు చెందిన వాటితో సహా ఏ ఇతర సంస్థల మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని తెలిపింది. అందువల్ల అమెరికాలో అదానీపై అభియోగపత్రం నేపథ్యంలో అప్పటి తమ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు సరికాదని పేర్కొంది.
ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి అత్యంత అనుకూలమైనదని, ఇంత తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల రాష్ట్రానికి సంవత్సరానికి రూ.3,700 కోట్లు ఆదా అవుతుందని తెలిపింది. ఈ ఒప్పందం 25 సంవత్సరాల కాలవ్యవధికి సంబంధించినది కాబట్టి, ఈ ఒప్పందం వల్ల రాష్ట్రానికి మొత్తం ప్రయోజనం అపారంగా ఉంటుందని వెల్లడించింది.












Click it and Unblock the Notifications