టీడీపీలోకి వైసీపీ సీనియర్లు - పదవుల పై చంద్రబాబు హామీ..!!
వైసీపీలో కీలకంగా వ్యవహరించిన నేతలు టీడీపీలో చేరుతున్నారు. ఎన్నికల్లో వైసీపీ ఓటమి తరువాత పలువురు నేతలు పార్టీ వీడారు. అందులో కొందరు టీడీపీలో, మరి కొందరు జనసేనలో చేరారు. ఇక..వైసీపీతో పాటుగా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన మోపిదేవి, బీదా మస్తాన్ రావు ఈ రోజు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నారు. వీరికి రాజకీయ భవిష్యత్ పైన చంద్రబాబు నుంచి హామీ దక్కింది.
నేడు టీడీపీలోకి
వైసీపీలో రాజ్యసభ సభ్యులుగా ఉన్న మోపిదేవి, బీదా ఇద్దరూ తమ ఎంపీ పదవులకు రాజీనామా చేసారు. ఈ రోజు టీడీపీలో అధికారికంగా చేరనున్నారు. టీడీపీ ముఖ్య నేతలతో సంప్రదింపుల తరువాతనే ఇద్దరూ తమ పదవులకు రాజీనామా చేసారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన సమయం లో 2019 ఎన్నికల్లో మోపిదేవి రేపల్లె నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోయారు. అయినా జగన్ ఎమ్మెల్సీగా చేసి తన మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. ఆ తరువాత రాజ్యసభకు పంపారు. 2024 ఎన్నికల్లో మోపిదేవికి సీటు దక్కలేదు. ఇక..తన కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం మోపిదేవి టీడీపీలో చేరుతున్నారని చెబుతున్నారు.

భవిష్యత్ పై హామీ
బీదా మస్తాన రావు సైతం వైసీపీ వీడారు. టీడీపీలో పని చేసిన బీదా వైసీపీలో చేరిన తరువాత రాజ్యసభకు ఎంపికయ్యారు. ఇప్పుడు తిరిగి టీడీపీలో చేరుతున్నారు. అయితే, ఇందులో మోపిదేవికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని చంద్రబాబు నుంచి హామీ దక్కినట్లు తెలుస్తోంది. అదే విధంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తరువాత మోపిదేవి కుమారుడికి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తామని చెప్పినట్లు సమాచారం. బీదా మస్తాన రావు వైసీపీ ఎంపీగా రాజీనామా చేయటంతో..తిరిగి టీడీపీ నుంచి రాజ్యసభకు పంపుతామని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, కూటమి లోని మూడు పార్టీల నుంచి రాజ్యసభకు పోటీ ఎక్కువగా కనిపిస్తోంది.
కూటమి నుంచి ముగ్గురు
ఇక, వైసీపీకి చెందిన మరో రాజ్యసభ సభ్యుడు ఆర్ క్రిష్ణయ్య సైతం రాజీనామా చేసారు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో ఉన్న సంఖ్య బలం ఆధారంగా మూడు స్థానాలు కూటమికే దక్కనున్నాయి. అందులో రాజీనామా చేసిన ముగ్గురూ బీసీ నేతలే కావటంతో చంద్రబాబు తిరిగి ఎవరికి అవకాశం ఇస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది. ప్రస్తుతం టీడీపీ నుంచి గల్లా జయదేవ్, జనసేన నుంచి నాగబాబు, బీజేపీ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే, బీసీ నేతలతో రాజీనామా చేయించి..సామాజిక సమీకరణాలు అమలు చేయకుంటే రాజకీయంగా విమర్శలు వచ్చే అవకాశం ఉంది. దీంతో..ఇప్పుడు కూటమి రాజ్యసభ అభ్యర్ధుల విషయంలో తీసుకునే నిర్ణయం పైన మూడు పార్టీల్లోనూ ఉత్కంఠ కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications