Undavalli Sridevi:ఉండవల్లి శ్రీదేవికి చంద్రబాబు సీటు ఖరారు..!
Undavalli Sridevi:వైసీపీ నుంచి సస్పెండ్ అయిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అధికారికంగా టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈనెల 15న ఆమె చేరికకు ముహూర్తం ఖరారైంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే సీటుపై చంద్రబాబు ఉండవల్లి శ్రీదేవికి క్లారిటీతో పాటు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. 2024లో తాడికొండ నుంచి కాకుండా మరో సీటు నుంచి ఉండవల్లి శ్రీదేవిని బరిలోకి దింపేందుకు చంద్రబాబు నిర్ణయించారు. తెలుగు దేశంలో అభ్యర్థుల ఎంపిక కసరత్తు వేగంగా సాగుతోంది. గెలుపే ప్రామాణికంగా చంద్రబాబు అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. సామాజిక ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా అభ్యర్థులను ఫైనల్ చేస్తున్న చంద్రబాబు... రాజధాని జిల్లాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు.
అక్కడి నుంచి పోటీ..
2019లో అమరావతి పరిధిలోని తాడికొండ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్సీ ఎన్నికల ఎపిసోడ్‌లో ఆ పార్టీకి దూరమయ్యారు. టీడీపీ అభ్యర్థికి మద్దతుగా ఓటింగ్ చేశారన్న ఆరోపణలతో వైసీపీ శ్రీదేవిని సస్పెండ్ చేసింది. రానున్న ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేయాలని శ్రీదేవి డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా లోకేష్ యువగళం పాదయాత్ర సమయంలో తాడికొండలో భారీ సభ నిర్వహించారు.

తాను వైసీపీలో ఉన్నప్పటికీ అమరావతికే మద్దతు ఇచ్చానని గుర్తు చేశారు. మారుతున్న సమీకరణాలతో ఉండవల్లి శ్రీదేవిని ఉమ్మడి కృష్ణా జిల్లా తిరువూరు నుంచి పోటీకి దించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నెల 15వ తేదీన శ్రీదేవి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో అధికారికంగా జాయిన్ కానున్నారు. దళిత వర్గానికి చెందిన శ్రీదేవి తిరువూరులో పోటీ చేయడం ద్వారా కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు.

శ్రీదేవి భర్త డాక్టర్ శ్రీధర్ కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. తిరువూరులోని సామాజిక వర్గాల సమీకరణాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత శ్రీదేవి పేరును ఆ నియోజకవర్గ అభ్యర్థిగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. జనసేనతో పొత్తు కూడా ఉండటంతో తిరువూరును టీడీపీ గెలుపు ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications