అంతుచిక్కని సీఎం జగన్ లెక్కలు - మరో 13 మంది మార్పు, జాబితా సిద్దం..!!
వైసీపీలో ఇంఛార్జ్ ల మార్పు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు రెండు జాబితాలకు ప్రకటించిన వైసీపీ..మరో 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్దులతో మలి విడత జాబితా ప్రకటనకు సిద్దమైంది. ఎంపీల ను ఖరారు చేస్తున్నారు. సీట్లు రాని కొందరు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. సీట్ల మార్పు పైన సీఎం నేరుగా అభ్యర్దులతో మాట్లాడుతున్నారు. కొందరు ఆమోదం చెప్పగా, మరి కొందరు తమ అభిప్రాయాలను స్పష్టం చేస్తున్నారు.
సీఎం జగన్ కసరత్తు:వైసీపీలో గెలుపే ప్రామాణికంగా ముఖ్యమంత్రి జగన్ అభ్యర్దులను ఖరారు చేస్తున్నారు. ఇప్పటి వరకు 38 మంది ఇంఛార్జ్ లను ఖరారు చేస్తూ అధికారికంగా రెండు జాబితాలను విడుదల చేసారు. మూడో జాబితా కసరత్తు తుది దశకు చేరుకుంది. ఇందులో 13 మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎంపీలను ఖరారు చేస్తూ లిస్టు విడుదల కానున్నట్లు తెలుస్తోంది. మలి విడత జాబితాలో అనంతపురం, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో నియోజకవర్గాలు ఉన్నట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో పెద్దగా మార్పులు లేవని చెబుతున్నారు. ప్రకాశం జిల్లాలో మార్పులకు సంబంధించి ఇప్పటికే ప్రాధమికంగా ఒక అంచనాకు వచ్చారు. తాజాగా ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, మద్దిశెట్టి వేణుగోపాల్ సీఎంతో సమావేశమయ్యారు.

ఎంపీలు - ఎమ్మెల్యేల మార్పు:మంత్రి జయరాం ను ఈ సారి కర్నూలు లోక్ సభ స్థానానికి మారుస్తారనే చర్చ జరుగుతోంది. ఆలూరు నుంచి ఒక బీసీ మహిళ కు అవకాశం ఇస్తారని చెబుతున్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత ఇప్పటికే రెండు విడతలుగా సమావేశం అయ్యారు.
ఆయన్నే అక్కడ కొనసాగిస్తారని చెబుతున్నా..తాజా మంత్రాంగం తో తుది నిర్ణయం పైన ఆసక్తి కొనసాగుతోంది. దర్శి సీటు ఈ సారి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ఇవ్వటం దాదాపు ఖాయమైంది. దీంతో, సిట్టింగ్ ఎమ్మెల్యే వేణుగోపాల్ ముందు కొత్త ప్రతిపాదనలు ఉంచారు. దీని పైన ఆలోచన చేసి చెప్పాలని సూచించారు. ఒంగోలు ఎంపీ సీటు పైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అదే సమయంలో నర్సరావుపేట సీటు సిట్టింగ్ ఎమ్మెల్యేకే ఖాయం చేసారు.

కొనసాగుతున్న ఉత్కంఠ:రాజంపేట స్థానం సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డికి ఖరారు చేసారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలును గుంటూరు నుంచి పోటీ చేయాలని సూచించినట్లు సమాచారం. అయితే, అందుకు ఆయన సిద్దంగా లేరని చెబుతున్నారు.
శ్రీకృష్ణదేవరాయలుకు గుంటూరు కేటాయించి, నర్సరావుపేట బీసీలకు కేటాయించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నరసరావుపేట టికెట్ లావుకి ఇవ్వాలని లోక్‌సభ పరిధిలోని ఆరుగురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కోరినట్లు చెబుతున్నారు. సీటు నిరాకరించటంతో విప్ కాపు రామచంద్రారెడ్డి పార్టీకి గుడ్‌బై చెప్పారు. వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేస్తానని ప్రకటించారు. ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ చేయబోయే మార్పుల పైన ఇప్పుడు ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications