జడ్పీ ఛైర్ పర్సన్ రిజర్వేషన్లు ఖరారు - ఏ సీటు ఎవరికి..!?
ఏపీలో స్థానిక ఎన్నికలకు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు తుది కసరత్తు జరుగుతోంది. ముందుగా మున్సిపల్..ఆ వెంటనే పరిషత్ ఎన్నికల నిర్వహణకు వీలుగా కార్యాచరణ సిద్దమైంది. ఇప్పటికే మున్సిపల్ రిజర్వేషన్లను ప్రకటించారు. జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ రిజర్వేషన్లు దాదాపు ఖరారయ్యాయి. ఇక.. పార్టీలు సైతం అటు మున్సిపల్.. ఇటు జిల్లా పరిషత్ ఎన్నికల్లో రిజర్వేషన్ల మేరకు అభ్యర్ధుల ఖరారు పైన కసరత్తు చేస్తున్నాయి.
ఏపీలో జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ల రిజర్వేషన్లు దాదాపు ఖరారయ్యాయి. మొత్తం 28 జిల్లా పరిషత్ లు ఉండగా 50 శాతం మహిళలకు కేటాయించనున్నారు. గతంలో13 గా ఉన్న జిల్లా పరిషత్ లు ఇప్పుడు 28 కావటంతో రొటేషన్ విధానం ఈ సారి ఉండదని చెబుతున్నారు. కాగా.. ఎస్టీ జనరల్ : పార్వతీపురం మన్యం; ఎస్టీ మహిళ : అల్లూరి సీతారామరాజు, పోలవరం ఉన్నాయి. అదే విధంగా
ఎస్సీ జనరల్ : బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఎన్టీఆర్, ప్రకాశం; ఎస్సీ మహిళ : గుంటూరు, తిరుపతి ఖరారయ్యాయి. ఇక, బీసీ జనరల్ : అనంతపురం, కర్నూలు, విశాఖపట్నం; బీసీ మహిళ : అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం జెడ్పీ ఛైర్ పర్సన్ లు ఉన్నాయి. కాగా.. జనరల్ మహిళ : బాపట్ల, చిత్తూరు, తూర్పు గోదావరి, ఏలూరు, కాకినాడ, కృష్ణా, పల్నాడు జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ లు కేటాయించనున్నారు. జనరల్ కోటాలో అన్నమయ్య, మార్కాపురం, నంద్యాల, పొట్టి శ్రీరాములు నెల్లూరు, సత్యసాయి, పశ్చిమ గోదావరి, వైఎస్సార్ కడప ఉన్నాయి.

నేడు అధికారిక జాబితా.. పార్టీల కసరత్తు
అయితే, వీటిల్లో తుది అధికారిక ప్రకటనలో మార్పులు ఉండే అవకాశం ఉంది. అదే విధంగా ఈ సాయంత్రానికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్లను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆదేశించింది. అదేవిధంగా బుధవారం సాయంత్రానికల్లా గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఖరారు చేయాలని సూచించింది. కమిషనర్ స్థాయిలో నిర్ధారించాల్సిన జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌ల రిజర్వేషన్లను కూడా మంగళవారం సాయంత్రానికల్లా పూర్తి చేయనున్నారు. ఈ నెల 14న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. ఆ తర్వాత 19న పరిషత్, అనంతరం సర్పంచ్‌ల ఎన్నికలను రెండు విడతల్లో చేపట్టేందుకు వరుసగా నోటిఫికేషన్లను జారీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అధికారులకు రిజర్వేషన్ల కేటాయింపులపై అవగాహన కల్పించారు. ఈ రిజర్వేషన్లకు అనుగుణంగా పార్టీలు సైతం తమ అభ్యర్ధుల ఎంపిక పైన తుది కసరత్తులో నిమగ్నమయ్యాయి.













Click it and Unblock the Notifications
