జగన్ బాటలో సీఎం సిద్దూ, సోషల్ మీడియాపై నిఘా, తేడా వస్తే తోలు తియ్యాలని ఆర్డర్!
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ రాష్ట్రంలో పరిస్థితులు మారుతున్నాయి. కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఆయన మార్క్ రాజకీయాలు మొదలుపెడుతున్నారు. 2024 లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం రాకుండా లోక్ సభ ఎన్నికల్లో కర్ణాటకలో అధిక స్థానాలు కైవసం చేసుకోవడానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఇప్పటి నుంచి పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కర్ణాటక గురించి, కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గురించి ఎవరైనా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసినా, కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి చెడుగా ప్రచారం చేసినా వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆ రాష్ట్ర పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

మంగళవారం బెంగళూరులో కర్ణాటక హోమ్ మంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ తో కలిసి సీఎం సిద్దరామయ్య ఆ రాష్ట్ర డీజీపీతో సహ సీనియర్ ఐపీఎస్ అధికారులు, సైబర్ క్రైమ్, ఐటీ వింగ్ పోలీసు అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో సీఎం సిద్దరామయ్య కర్ణాటక పోలీసులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారని వెలుగు చూసింది.
2013లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ( అప్పుడు సీఎంగా సిద్దరామయ్య ఉన్నారు) కర్ణాటక ప్రభుత్వం గురించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చెయ్యడం మొదలైయ్యిందని సీఎం సిద్దరామయ్య అన్నారు. అయితే ఇప్పుడు మరోసారి కర్ణాటక ప్రభుత్వం గురించి ఎవరైనా సోషల్ మీడియాతో తప్పుడు ప్రచారం చేసినా, అవాస్తవాలు షేర్ చేసినా వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం సిద్దరామయ్య పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
2024లో జరిగే లోక్ సభ ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయని, అలాంటి ఎన్నికలకు ముందు కర్ణాటక ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉందని సీఎం సిద్దరామయ్య అభిప్రాయం వ్యక్తం చేశారని తెలిసింది. సోషల్ మీడియాను కొందరు దుర్వినియోగం చేస్తున్నారని, అలా జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సీఎం సిద్దరామయ్య పోలీసు అధికారులకు సూచించారు.

గతంలో తాను సీఎంగా ఉన్న సమయంలో గోవధ జరుగుతోందని, చిన్న పిల్లలను ఎత్తుకుపోతున్నారని సోషల్ మీడియాలో జోరుగా తప్పుడు ప్రచారం జరిగిందని, అలాంటి సంఘటన మరోసారి ఎదురుకాకుండా చూసుకోవాలని, సైబర్ క్రైమ్ పోలీసులు ఈ విషయంపై నిఘా వెయ్యాలని, ప్రతినెల తనకు నివేదిక సమర్పించాలని సీఎం సిద్దరామయ్య పోలీసు అధికారులకు కట్టదిట్టమైన ఆదేశాలు జారీ చేశారు.
రాహుల్ గాంధీ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ. నడ్డాతో పాటు బీజేపీ ఐటీ సెల్ చీఫ్ మాన్వియా మీద కర్ణాటక ఐటీ, బీటీ శాఖా మంత్రి ప్రియాంక్ ఖార్గే బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన మరుసటి రోజే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య పోలీసు అధికారులకు ఇలాంటి ఆదేశాలు జారీ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా సోషల్ మీడియాతో ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కాని, ఆ పార్టీనాయకుల మీద కాని, ప్రభుత్వం మీద కాని తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించిన విషయం తెలిసిందే. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందిన ఐటీ సెల్ విభాగం నాయకులు జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చి కోర్టుల చుట్తూ తిరుగుతున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications