కర్ణాటక: 'మే'లో పీక్స్‌కి కరోనా... ఒక్క బెంగళూరులోనే రోజుకు 18వేల కేసులు నమోదయ్యే ఛాన్స్
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కర్ణాటకలో మే మొదటివారానికి కేసుల సంఖ్య పీక్స్‌కి చేరే అవకాశం ఉందని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కె.సుధాకర్ వెల్లడించారు. ఈ మేరకు ఇప్పటికే నిపుణులు హెచ్చరించారని... దీనిపై నివేదికను అందజేయాల్సిందిగా వారిని కోరామని తెలిపారు. నిపుణులు ఇచ్చే నివేదిక ఆధారంగా రానున్న రోజుల్లో కరోనా నియంత్రణకు అవసరమైన చర్యలు చేపడుతామని చెప్పారు.
'నిపుణుల అభిప్రాయం ప్రకారం ఏ మహమ్మారి వేవ్ అయినా 80 నుంచి 120 రోజుల పాటు ఉంటుంది. కాబట్టి మే నెలాఖరు వరకు మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం ఉన్నది ప్రారంభ దశ మాత్రమే...' అని మంత్రి కె.సుధాకర్ పేర్కొన్నారు. మే మొదటివారానికి కేసుల సంఖ్య పీక్స్‌కి చేరి... అదే నెల చివరి నాటికి క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు. నిపుణుల అభిప్రాయాలను,సూచనలను ముఖ్యమంత్రి యడియూరప్పకు తెలియజేస్తామన్నారు.

ఆర్థిక కార్యకలాపాలకు బ్రేక్ వేసే సూచనలేవీ నిపుణులు సూచించలేదని... జనం ఒకచోట గుంపుగా చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పినట్లు తెలిపారు. రాష్ట్రంలో పూర్తి లాక్‌డౌన్ పెట్టే యోచన ఉందా అన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు ఆయన నేరుగా సమాధానమివ్వలేదు. నిపుణులు ఇచ్చే నివేదిక ఆధారంగానే ప్రభుత్వ చర్యలు ఆధారపడి ఉంటాయన్నారు. రాత్రి కర్ఫ్యూపై మరో మూడు,నాలుగు రోజుల తర్వాత రివ్యూ చేసి... దాన్ని పొడగించడమా లేదా అన్నది నిర్ణయిస్తామన్నారు. కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆస్పత్రుల్లో వైద్య సౌకర్యాలను కూడా పెంచుతామన్నారు.
బెంగళూరులోని జయదేవ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ డైరెక్టర్ మంజునాథ్ మాట్లాడుతూ... మే 15 నాటికి ఒక్క బెంగళూరు నగరంలోనే రోజుకు 15వేల నుంచి 18వేల కరోనా కేసులు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం బెంగళూరులో నిత్యం 5500 నుంచి 6వేల వరకు కరోనా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా 20-40 ఏళ్ల మధ్య వయస్కుల్లో ఎక్కువగా ఇన్ఫెక్షన్లు నమోదవుతున్నాయి.
ఉగాది,ఇతరత్రా పండగలు వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజలు బెంగళూరు నుంచి స్వస్థలాలకు వెళ్లే అవకాశం ఉంది. దీంతో నగరం నుంచి గ్రామీణ ప్రాంతాలకు వైరస్ వ్యాప్తి చెందవచ్చునన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కర్ణాటక ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో రాత్రి 10గంటల నుంచి తెల్లవారుజామున 5గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూని అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 10 నుంచి ఏప్రిల 20 వరకు ఇది కొనసాగనుంది.












Click it and Unblock the Notifications