IT HUB: మెట్రో రైళ్లు, సిటీ బస్సుల్లో నిలబడి ప్రయాణం నిషేధం, ఐటీ హబ్ ప్రజలకు షాక్, కరోనా దెబ్బ !
బెంగళూరు: కరోనా వైరస్ మహమ్మారి థర్డ్ వేవ్ దెబ్బతో భారతదేశంలోని అనేక రాష్ట్రాల ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. దేశంలో కరోనా వైరస్ మరోసారి ప్రమాద సంకేతాలు ఇస్తోంది. ఇప్పటికే కరోనా వైరస్ మరోసారి తన ప్రతాపాన్ని చూపించడంతో ప్రజలు హడలిపోతున్నారు. రెండు రోజులుగా దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. దేశంలో ముందు రోజుకంటే 55 శాతం కేసులు ఎక్కువగా నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేశారు. ఐటీ హబ్ లో మెట్రో రైలులో, సిటీ బస్సుల్లో నిలబడి ప్రయాణించడాన్ని నిషేధిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఐటీ హబ్ లో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకు పెరిగిపోయే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. మాల్స్, సినిమా హాట్స్, ఫంక్షన్ హాల్స్ తో పాటు శుభకార్యాలు జరిగే వేదికల్లో 50 శాతం మంది మాత్రమే హాజరు కావాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

సీఎంతో అత్యవసర సమావేశం
కర్ణాటకలో కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చెయ్యాలని ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. బెంగళూరులోని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ అధికారిక నివాసం కృష్ణలో మంత్రులు, అధికారులతో సీఎం బసవరాజ్ బోమ్మయ్ అత్యవసర సమావేశం నిర్వహించారు.

ఏం చెయ్యాలి ?, ఎలా కట్టడి చెయ్యాలి
కర్ణాటకలో, ఐటీ హబ్ బెంగళూరులో కరోనా వైరస్ ను ఎలా కట్టడి చెయ్యాలి అంటూ సీఎం బసవరాజ్ బోమ్మయ్ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. కోవిడ్ టెక్నికల్ సలహా సమితి సభ్యులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రవికుమార్, బీబీఎంపీ కమీషనర్ గౌరవ్ గుప్తాతో పాటు ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం బసవరాజ్ బోమ్మయ్ కరోనా కట్టడి విషయంలో మంతనాలు జరిపారు.

మెట్రో రైలు, బీఎంటీసీ బస్సుల్లో ?
ఐటీ హబ్ బెంగళూరులో నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడే మెట్రో రైళ్లు, బీఎంటీసీ బస్సుల్లో (బెంగళూరు సిటీ బస్సులు) ప్రయాణికుల రద్దిని కట్టడి చెయ్యాలని అధికారులు సూచించారు. మెట్రో రైళ్లు, బీఎంటీసీ బస్సుల్లో ఎన్ని సీట్లు ఉంటే అంత మంది మాత్రమే ప్రయాణించడానికి అనుమతి ఇవ్వాలని, ఎవ్వరూ నిలబడి ప్రయాణించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం బసవరాజ్ బోమ్మయ్ సంబంధిత అధికారులకు సూచించారు.

అధికారులు, సిబ్బందిదే బాధ్యత
సిలికాన్ సిటీ బెంగళూరులోని అన్ని మెట్రో రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు అవగాహన కల్పించి ఎన్ని మెట్రో రైలులో ఎన్ని సీట్లు ఉంటే అంతమందే ప్రయాణించడానికి అవకాశం ఇవ్వాలని, బీఎంటీసీ బస్సుల్లో కూడా ప్రయాణికుల సంఖ్య తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని, ఆ బాధ్యత సంబంధిత అధికారులు, సిబ్బంది చూసుకోవాలని సీఎం బసవరాజ్ బోమ్మయ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిసింది.
Recommended Video

ప్రభుత్వ ఆదేశాలు జారీ
బుధవారం నుంచి బెంగళూరులోని మెట్రో రైళ్లల్లో, బీఎంటీసీ బస్సుల్లో ఎవ్వరూ నిలబడి ప్రయాణించకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో అదనపు బీఎంటీసీ బస్సులు నడపడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బీఎంటీసీ, మెట్రో రైళ్లకు నష్టం వచ్చినా పర్వాలేదు కాని కరోనా వైరస్ మరింత వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రభుత్వం సంబంధిత అధికారులకు కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications