బాంబినో వ్యవస్థాపకుడి ఆస్తి వివాదం: కుమార్తెలపై కేసు నమోదు
హైదరాబాద్ కు చెందిన ప్రముఖ 'బాంబినో' కంపెనీ వ్యవస్థాపకుడు మ్యాడం కిషన్ రావు కుటుంబంలో ఆస్తుల పంపకం, షేర్ల బదిలీకి సంబంధించిన వివాదం తెరపైకి వచ్చింది. కిషన్‌రావు పేరిట ఉన్న షేర్లను ఆయన నలుగురు కుమార్తెలు అక్రమంగా తమ పేర్ల మీదికి బదిలీ చేయించుకున్నారంటూ కిషన్ రావు మనవడు కార్తికేయ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కిషన్ రావు నలుగురు కుమార్తెలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మ్యాడం కిషన్ రావు 1982లో బాంబినో అగ్రో ఇండస్ట్రీస్‌ను.. అంతకు ముందు 1973లోనే రేవతి టొబాకో కంపెనీని కూడా స్థాపించారు. ఈ రెండు కంపెనీల్లో కిషన్ రావుకు గణనీయంగా వాటా ఉంది. రేవతి టొబాకో కంపెనీలో కిషన్ రావుకు 98.23 శాతం వాటా ఉండగా.. మిగిలిన 1.77 శాతం వాటా ఆయన భార్య సుగంధబాయి పేరిట ఉంది. రేవతి టొబాగో కంపెనీకి రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నందివనపర్తిలో దాదాపు 184 ఎకరాల భూమి ఉంది. దీని ప్రస్తుత విలువ సుమారు రూ.120 కోట్లుగా అంచనా. మ్యాడం కిషన్ రావు 2021లో మరణించారు.

మనవడు కార్తికేయ ఫిర్యాదు ప్రకారం.. కిషన్ రావు మరణానంతరం ఆయన కుమార్తెలు.. అనూరాధ(ఎంకే రావు ఫౌండేషన్ ట్రస్టీ), శ్రీదేవి, ఆనందదేవి, తుల్జాభవాని నలుగురు కలిసి వీలునామాలోని అంశాలకు వ్యతిరేకంగా వ్యవహరించారు. కిషన్ రావు పేరిట ఉన్న షేర్లను వీరు ఒక్కొక్కరూ 24.55 శాతం చొప్పున అక్రమంగా తమ పేర్ల మీదికి బదిలీ చేసుకున్నారని కార్తికేయ ఆరోపించారు. అంతే కాకుండా నందివనపర్తిలోని రూ. 120 కోట్ల విలువ చేసి 184 ఎకరాల భూమి పంపకాల విషయంలోనూ కిషన్ రావు కుమార్తెలు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. వీలునామా ఉల్లంఘన, ఆస్తుల అక్రమ బదిలీ ఆరోపణల నేపథ్యంలో సీసీఎస్ పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.
బాంబినో అనేది హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఆహార తయారీ సంస్థ. 1982లో స్థాపించబడిన ఈ సంస్థ సేమియా, మాకరోనీ, ఇతర పాస్తా ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్ చేయడంలో ఇండియాలో అగ్రగామిగా ఉంది. ఈ సంస్థ ఇండియాతో పాటు అనేక దేశాలకు తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది. ఈ సంస్థ స్నాక్స్, మసాలా దినుసులు, ఇతర ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులను కూడా అందిస్తుంది. ఇండియాలో తన ఉనికిని చాటుకున్న బాంబినో.. ప్రపంచవ్యాప్తంగా 35 దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది.












Click it and Unblock the Notifications