ఇజ్రాయెల్-ఇరాన్ వార్ ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్
పశ్చిమాసియాలో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపించాయి. ఈరోజు ( జూన్ 13, 2025 - శుక్రవారం ) భారీ నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. అలానే కొనసాగుతున్నాయి. ప్రముఖ మార్కెట్ విశ్లేషకులు ప్రపంచ మార్కెట్ సూచికలను నిశితంగా పరిశీలిస్తూ.. మార్కెట్ స్థిరీకరణ కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. కాగా నిఫ్టీ 50 సూచీ 24,550 దిగువకు పడిపోగా, బీఎస్‌ఈ సెన్సెక్స్ 1,100 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఉదయం 10:53 గంటల సమయానికి నిఫ్టీ 202 పాయింట్లు తగ్గి 24,685.85 వద్ద, బీఎస్‌ఈ సెన్సెక్స్ 684 పాయింట్లు నష్టపోయి 81,008.09 వద్ద ట్రేడ్ అయ్యాయి.
మార్కెట్ పతనానికి కారణాలు..
ఇరాన్‌పై ఇజ్రాయెల్ సైనిక దాడుల కారణంగా మధ్యప్రాచ్యంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆసియా మార్కెట్లలో భారీ నష్టాలు సంభవించాయి. దీని ప్రభావం దేశీయ మార్కెట్లపై కూడా పడింది. వివిధ రంగాల వారీగా చూస్తే, నిఫ్టీ ఆయిల్ & గ్యాస్ సూచీ 1.6% నష్టంతో అత్యధికంగా పతనమైంది. మహానగర్ గ్యాస్, ఐజీఎల్, బీపీసీఎల్, ఐఓసీ షేర్లు క్షీణించడంతో ఈ సూచీ నష్టపోయింది. నిఫ్టీ బ్యాంక్, ఐటీ, ఆటో, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్ సూచీలు 1% నుంచి 1.5% వరకు నష్టపోయాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 1.1%, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీ 1.5% క్షీణించడంతో విస్తృత మార్కెట్ సూచీలు కూడా పతనమయ్యాయి. ఈటీ నివేదిక ప్రకారం, బీఎస్‌ఈలో లిస్ట్ అయిన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ. 5.52 లక్షల కోట్లు తగ్గి రూ. 444.06 లక్షల కోట్లకు చేరింది.

మార్కెట్లలో అనిశ్చితి పెరగడంతో మదుపర్లు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపారు. బెంచ్‌మార్క్ US 10-Year ట్రెజరీ ఈల్డ్స్ 4.31%కి పడిపోయాయి, ఇది నెలలో అతి తక్కువ. స్విస్ ఫ్రాంక్ డాలర్‌తో పోలిస్తే 0.4% పెరిగి 0.8072కి చేరుకుంది, జపనీస్ యెన్ 0.3% పుంజుకుని 143.12కి చేరుకుంది. డాలర్ సూచీ 0.5% పెరిగి 98.131 వద్ద స్థిరపడింది.
ఇజ్రాయెల్ దాడి..
ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడులు ప్రారంభించడంతో మార్కెట్ పతనం మొదలైంది. టెహ్రాన్ అణు ఆయుధాల అభివృద్ధికి వ్యతిరేకంగా దాడి చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. క్షిపణులు, డ్రోన్ల ద్వారా ఎదురుదాడి జరిగే అవకాశం ఉండటంతో ఇజ్రాయెల్ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ దాడుల్లో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ చీఫ్ హొస్సేన్ సలామీ, మిలిటరీ చీఫ్ మహమ్మద్ బాఘేరి సహా పలువురు సీనియర్ జనరల్స్ ప్రాణాలు కోల్పోయారు. అమెరికా ఈ దాడిలో పాల్గొనలేదని, ఇది ఇజ్రాయెల్ యొక్క ఏకపక్ష చర్య అని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో పేర్కొన్నారు. అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు ఆదివారం ఒమన్‌లో జరగనున్నాయి.
చమురు సరఫరా ఆందోళనలు..
బ్రెంట్ ముడి చమురు ఫ్యూచర్స్ 03:15 GMT వద్ద $6.29 (9.07%) పెరిగి బ్యారెల్‌కు $75.65 డాలర్లకు చేరుకుంది. జనవరి 27 తర్వాత ఈ స్థాయికి చేరడం ఇదే మొదటిసారిగా చెబుతున్నారు. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) ముడి చమురు బ్యారెల్‌కు $6.43 (9.45%) పెరిగి $74.47 డాలర్లకు చేరుకుంది. ఇది జనవరి 21 తర్వాత గరిష్ట స్థాయి. రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత ఇంధన ధరలు గణనీయంగా పెరిగాయి. ఆ తరువాత ఈ రెండు బెంచ్‌మార్క్‌లు 2022 నుండి ఇదే అతిపెద్ద పెరుగుదలను నమోదు చేశాయి.
ఇజ్రాయెల్ ఈ ఆపరేషన్ మరికొన్ని రోజులు కొనసాగుతుందని ప్రకటించింది. ఇరాన్ ప్రతీకారంగా Hormuz జలసంధిని మూసివేస్తే చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మొత్తానికి, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, చమురు ధరల పెరుగుదల, ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి వంటి కారణాల వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి.












Click it and Unblock the Notifications