క్రమశిక్షణ తప్పిన టీచర్లు.. విద్యార్థులను ఎండలో నగ్నంగా నిలబెట్టిన వైనం
చిత్తూరు : విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులు దారి తప్పుతున్నారు. క్రమశిక్షణ నేర్పాల్సింది పోయి వారే డిసిప్లెయిన్ లేకుండా మారుతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలో జరిగిన ఘటన విద్యావ్యవస్థకు మాయని మచ్చలా మారింది. హోంవర్క్ చేయలేదనే కారణంతో విద్యార్థుల పట్ల టీచర్లు వ్యవహరించిన తీరు వివాదస్పదమైంది.

పుంగనూర్ మండలం నానాసాహెబ్‌పేటలోని చైతన్యభారతి స్కూల్ యాజమాన్యం విద్యార్థులకు విధించిన శిక్ష చర్చానీయాంశమైంది. హోంవర్క్ చేయలేదని పదేళ్ల వయసున్న ఆరుగురు పిల్లల్ని నగ్నంగా ఎండలో నిలబెట్టారు. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో స్కూల్ మేనేజ్‌మెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కరస్పాండెంట్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. అటు విద్యాశాఖ అధికారులు కూడా రంగంలోకి దిగారు. స్కూల్ గుర్తింపును రద్దు చేశారు.